ఓ
అర్జునా! నేను నిత్యసత్యమైన ఈ యోగమును సూర్యునకు తెలిపితిని.సూర్యుడు తన కుమారునకు
మనువునకు దీనిని బోదించెను. ఆ మనువు తన కుమారుడైన ఇక్ష్వాకునకు చెప్పెను.ఈ విధముగ
పరంపరగా వచ్చిన ఈ యోగమును రాజర్షులు తెలిసికొనిరి. కానీ అనంతరం ఈ యోగము కాలక్రమమున
భూలోకమందు అగుపించుటలేదు.ఈ యోగము ఉత్తమమైనది. కనుక మిక్కిలి పురాతనమైన ఈ యోగమును
నీకు తెలుపుతాను. (4:1,2,౩)
అర్జునుడు
పలికెను – కృష్ణా! నీ జన్మ ఇటీవలిది. సూర్యుని జన్మ
కల్పాదియందు జరిగినది. అనగా అతి ప్రాచీనమైనది. కనుక నీవు సూర్యునకు దీనిని
ఉపదేశించుట ఎట్లు సాధ్యపడును ? దీనిని నేను ఏ విధముగా తెలుసుకోగలను. (4:4)
శ్రీ
భగవానుడు తెలిపెను – ఓ అర్జునా! నాకును నీకును అనేక జన్మలు గడచినవి. కాని
వాటిని అన్నింటిని నేను యెరుంగుదును. నీవెరుగవు. (4:5)
నేను
పుట్టుక లేనివాడను, నిత్యుడను, సమస్త ప్రాణులకు ఈశ్వరుడను. అయినను నా ప్రకృతిని
ఆధీనములో నుంచుకొని, నా యోగమాయచే జన్మమెత్తుచున్నాను. (4:6)
ఓ అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడు, అధర్మము
పెచ్చుపెరిగిపోవుచున్నప్పుడు నన్ను నేను సృజించుకొందును. అనగా సాకారరూపముతో ఈ
లోకమున అవతరింతును. (4:7)
సజ్జనులను
పరిరక్షించుటకు, దుష్టులను రూపుమాపుటకు, ధర్మమును సుస్థిరమొనర్చుటకు నేను
ప్రతియుగమునందును అవతరించుచుందును. (4:8)
ఓ
అర్జునా! ఎవరు నా దివ్యమైన జన్మమును, కర్మమును గూర్చి యధార్ధముగా తెలుసుకొనునో
అట్టివాడు తనువును చాలించిన పిమ్మట మరల జన్మింపడు సరికదా! నన్నే పొందుచున్నాడు. (4:9)
అనురాగము,
భయము, క్రోధము వీడిన వారు దృఢమైన భక్తీ తాత్పర్యములతో స్థిరబుద్ధి కలిగి, నన్ను
ఆశ్రయించిన భక్తులు జ్ఞానతపస్సంపన్నులై పవిత్రులై పరిశుద్ధులై నా స్వరూపమును
పొందియున్నారు (నా సాన్నిధ్యమును పొందిరి). (4:10)
ఓ
పార్థా! భక్తులు ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియకోరుచున్నారో వారిని ఆయా
విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగముకాని, ద్వేషముగాని
లేవు. (4:11)
ఈ
లోకమున కర్మఫలమును ఆశించువారు ఇతర దేవతలను పూజింతురు. ఏలనన అట్లు చేయుటచే కర్మలవలన
కలుగు సిద్ది వారికి శీఘ్రముగా కలుగుచున్నది. (4:12)
ఈ
సృష్టి కార్యమునకు నేనే కర్తనైనను, శాస్వతుడను, పరమేశ్వరుడను అయినను నన్ను
వాస్తవముగా అకర్తనుగా తెలిసికొనుము. (4:13)
నాకు
కర్మఫలాసక్తి లేదు. కావున కర్మలు నన్నంటవు. ఈ విధముగా నా తత్వమును తెలిసినవారు
కర్మలచే బందింపబడరు. (4:14)
ఓ
అర్జునా! నా తత్త్వ రహస్యమును దెలిసికొని కర్మల నాచరించిరి. కావున నీవును ఆ
పూర్వులవలెనే నిష్కామ భావముతో కర్మల నాచరింపుము. (4:15)
అర్జునా!
కర్మ అనగా ఏమి? అకర్మ అనగా ఏమి ? నీకు చక్కగా వివరించెదను .
కర్మయందు
అకర్మను, అకర్మయందు కర్మను దర్శించువాడు మానవులలో వివేకమయుడు. అతడు యోగి మరియు
సమస్తకర్మలు చేయువాడు. (4:18)
ఎవని
కర్మలన్నియును శాస్త్రసమ్మతుములై, కామసంకల్ప వర్జితములై జరుగునో అట్లే ఎవని
కర్మలన్నియును జ్ఞానాగ్నిచే భస్మమగునో అట్టి మహాపురుషుని జ్ఞానులు పండితులని
పేర్కొనిరి. (4:19)
ఎవడు
కర్మఫలమందాసక్తిని విడనాడి నిరంతరము సంతృప్తి కలవాడై దేనిని ఆశ్రయించకనుండునో, అట్టివాడు
వాస్తవముగా వాటికీ కర్తకాడు. (4:20)
అంతఃకరణమును,
శరీరేంద్రియములను జయించినవాడు, సమస్త భోగాసామగ్రిని పరిత్యజించినవాడు, ఆశారహితుడు
ఐన సాంఖ్యయోగి కేవలము శరీరికకర్మలను ఆచరించుచును పాపములను పొందడు. (4:21)
అప్రయత్నముగా
అమరిన లాభములతో సంతుష్టుడైనవాడు, అసూయలేనివాడు, హర్శశోకాదిద్వంద్వములకు అతీతుడు
అయినవాడు సిద్దియందును. అసిద్దియందును సమద్రుస్టి కలిగియుండును. అట్టి కర్మయోగి
కర్మలచారించుచున్నను వాటి చేత బందింపబడవు.
(4:22)
ఏలనన
ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏ మాత్రమూ లేనివాడును, పరమాత్మజ్ఞానమునందే నిరంతరము మనస్సును
లగ్నమొనర్చినవాడును, కేవలము యజ్ఞార్దమే కర్మలను ఆచరించువాడును అగు మనుష్యుని యొక్క
కర్మలన్నియును పూర్తిగా విలీనమగును. అనగా నసించిపోవును. (4:23)
యజ్ఞకార్యములయందు
ఉపయుక్తమగు స్రువాదిసాధనములు బ్రహ్మము. హోమము చేయబడు ద్రవ్యము బ్రహ్మము. అగ్నియు
బ్రహ్మము. యజ్ఞము నాచరించు కర్తయు బ్రహ్మము. ఈ బ్రహ్మకర్మయందు స్థితుడైయుండు యోగి
ద్వారా పొందదగిన యజ్ఞఫలము గూడ బ్రహ్మమే అయియున్నది. (4:24)
కొందరు
యోగులు మనోనిగ్రహము ద్వార శ్రోత్రాది ఇంద్రియములను అదుపు చేయుదురు. తత్ఫలితముగా
శబ్దాది విషయములు ఎదురుగ ఉన్నను లేకున్నను వాటిప్రభావము వారి ఇంద్రియములపై ఏ
మాత్రము ఉండదు. (4:26)
కొందరు
ఇంద్రియముల పంచప్రాణముల వ్యాపారములను జ్ఞానదీప్తమైన ఆత్మ సంయోగమనెడి అగ్నియందు
హొమం చేయుచున్నారు. (4:27)
ఇంకను
కొందరు నియమితాహార నిష్టితులై, ప్రాణాయామ పరాయణులైనవారు ప్రాణాపాన గమనములను
నిలిపి, ప్రాణములను ప్రాణములయందే హవనము చేయుదురు. యజ్ఞవిదులైన వీరందరూ యజ్ఞముల
ద్వారా పాపములను రూపుమాపుదురు. (4:౩౦)
ఈ
యజ్ఞములు నన్నింటిని త్రికరణశుద్దిగా ఆచరించినప్పుడే అవి సుసంపన్నములగునని
తెలిసికొనుము. ఇట్లు ఈ కర్మతత్వమును తెలిసికొనుము, అనుష్ఠానము వలన నీవు ప్రాపంచిక
బంధములనుండి సర్వధా విముక్తుడవయ్యెదవు. (4:32).
ఓ అర్జునా! ద్రవ్యమయ యజ్ఞముకంటేను జ్ఞానయజ్ఞము మిక్కిలి శ్రేష్టమైనది.
కర్మలన్నియును జ్ఞానమునందే పరిసమాప్తమగును. (4:౩౩)
అట్టి
జ్ఞానము, తత్త్వవేత్తలగు జ్ఞానులకు సాష్టాంగ నమస్కారమొనర్చి, సమయము చూచి, వినయముగా
ప్రశ్నించి, సేవచేసియు వారివలన నెరుంగుము. వారు తప్పక నీకుపదేశింతురు. (4:34)
ఓ
అర్జునా! ఈ తత్వజ్ఞానమునెరింగినచో మరల ఇట్టి వ్యామోహములో చిక్కుకొనవు.ఈ జ్ఞాన
ప్రభావముతో సమస్తప్రాణులను నీలో సంపూర్ణముగా చూడగలవు. (4:35)
ఒకవేళ పాపాత్ములందరికంటేను నీవు ఒక మహాపాపివి అయినచో, జ్ఞానమనే తెప్ప
సహాయముతో పాపసముద్రమునుండి నిస్సందేహముగా పూర్తిగా దాటివేయగలవు. (4:36)
ఓ అర్జునా! ప్రజ్వలించుచున్న అగ్ని సమిధులను భస్మముచేసినట్లు జ్ఞానమను
అగ్ని అన్ని కర్మలను భస్మమొనరించును. (4:37)
ప్రపంచమున
జ్ఞానముతో సమానముగా పవిత్రమైనది మరియొకటి లేనేలేదు. శుద్దాంతఃకరణముగల సాధకుడు
బహుకాలమువరకు కర్మయోగాచారణము చేసి, ఆత్మయందు అదే జ్ఞానమును తనంతట తనే
పొందుచున్నాడు. (4:38)
ఇంద్రియ
నిగ్రహము కలవానికి, తదేక నిష్టకలవానికి, శ్రద్దాళువైన మనుజునకు ఈ భగవత్తత్వ
జ్ఞానము లభించును. ఆ జ్ఞానము కలిగిన వెంటనే అతడు భగవత్తత్వరూపమైన పరమశాంతిని
పొందుచున్నాడు. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. (4:39)
అవివేకియు, శ్రద్ధారహితుడును అయిన సంశయాత్ముడు పరమార్థ విషయమున
అవశ్యము భ్రస్టుడేయగును. అట్టి సంశయచిత్తునకు ఈ లోకమునందుగాని, పరలోకమునందుగాని
ఎట్టి సుఖమూ వుండదు. (4:40)
ఓ
ధనంజయా! విదిపూర్వకముగా కర్మలను ఆచరించుచు, కర్మ ఫలములను అన్నింటిని భగవదార్పనము
చేయుచు, వివేకముద్వార సంశయములన్నింటిని తొలగించుకొనుచు, అంతఃకరణమును
వసమునందుంచుకొనిన వానిని కర్మలు బందింపవు. (4:41)
కావున!
నీ హృదయమునందు, అజ్ఞానము వలన పుట్టిన సంశయమును, వివేక
జ్ఞానమను ఖడ్గముతో రూపుమాపి, సమత్వరూప కర్మయోగమునందు స్తితుడవై యుద్దమునకు
సన్నద్దుడవగు లెమ్ము. (4:42).
No comments:
Post a Comment