Wednesday, February 12, 2014

పదిహేడవ అధ్యాయం : శ్రద్ధాత్రయవిభాగయోగః

అర్జునుడు పలికెను – కృష్ణా! శాస్త్రవిధిని వదలి, భక్తిశ్రద్దలతో యజ్ఞములనుగాని, దైవపూజలనుగాని కొందఱు చేయుచుందురు. వారినిష్ట సాత్వికమా? రాజసమా? తామసమా? (17:1)
జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి. (17:2)
అర్జునా! సర్వ ప్రాణులకు వారి అంతఃకరణరీతులకు తగినట్లు శ్రద్ధ ఉండును. ప్రతి వ్యక్తికిని ఎదో ఒక శ్రద్ధ ఉండును. అతని జీవన విధానమంత యును అతని శ్రద్దకు అనుగుణముగా కొనసాగుచుండును. దానినిబట్టి అతడెట్టి శ్రద్ధ కలిగియున్నదియు తెలిసికొనవచ్చును. (17:౩)
సత్వగుణులు దేవతలను, రాజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు. (17:4)
ఢంభము అహంకారము గలవారు, కోరికలు ఆసక్తి కలిగియుండువారు, బలగార్వితులు ఐనవారు, శాస్త్రవిరుద్దముగా మనఃసంకల్పితమైన ఘోరతపస్సులు చేయుదురు. (17:5)
శరీరములందున్న జీవులను మరియు అంతర్యామిని అనగా పరమాత్ముడైన నన్ను క్రుశింపజేయువారు అజ్ఞానులైన అసురస్వభావము గలవారని తెలిసికొనుము. (17:6)
ఆయువు, బుద్ధి, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరచునవియు, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్నపదార్థములును, ఓజస్సును అభివృద్ధి పరచు స్థిరపదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృద్య పదార్థములను సాత్వికులకు ప్రియములు. (17:8)
చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబందించినవి, మిక్కిలి వేడి వస్తువులు, మాడిన పదార్థములు, దాహము కల్గిన్చునవి, అట్లే దుఃఖము, చింత రోగములను ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస్వభావము గలవారికి ప్రియములు. (17:9)
సరిగా ఉడకనివి, పండనివి రసహీనములు, చెడువాసన గలవి, పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామసులకు ప్రియమైనవి. (17:10)
శాస్త్రోక్తమైనదియు, ఈ యజ్ఞము నాకు కర్తవ్యము అని మనస్సున దృడముగా నిశ్చయించు కొనబదినదియు, ప్రతిఫలాపేక్ష లేకుండా చేయబడు నదియు ఐన యజ్ఞము సాత్వికమనబడును. (17:11)
కాని ఓ అర్జునా! సరియైన నిష్ట లేకుండా ఆడంబరము కొరకు ఆచరింపబడునదియు, ప్రతిఫలాపేక్షతో చేయబడునదియు అగు యజ్ఞము రాజసయజ్ఞము అని తెలిసికొనుము. (7:12)
శాస్త్రవిధిననుసరింపనిదియు, అన్నదానరహితమైనదియు, మంత్రహీనమైనదియు, దక్షిణలు లేనిదియు, శ్రదారహితమైనదియు అగు యజ్ఞము తామసయజ్ఞము అని తెలిసికొనుము. (17:13)
దేవతలను, బ్రాహ్మణులను, గురుజనులను, జ్ఞానులను సేవించుట, నిరాడంబరత్వము, బ్రహ్మచర్యము, అహింస అనునవి శారీరక తపస్సులు అని చెప్పబడును. (17:14)
ఉద్రేకము కలిగింపనిదియు, ప్రియమైనదియు, హితమును కలుగాచేయునది, యదార్థమైనదియు అగు భాషణము, అట్లే వేదశాస్త్ర పఠనము మొదలగునవి యన్నియును వాచిక తపస్సుగ చెప్పబడుచున్నవి. (17:15)
మానసిక ప్రశాంతత, శాంతస్వభావము, భగవచ్చింతన ,మనోనిగ్రహము, అంతఃకరణశుద్ది మొదలగునవి మానసిక తపస్సులుగా చెప్పబడుచున్నవి. (17:16)
శారీరక, వాచిక, మానసిక తపస్సులకు ఫలాకాంక్షలేని యోగులు మిక్కిలి శ్రద్ధతో ఆచరించినపుడు వాటిని సాత్విక తపస్సులు అని చెప్పబడును. (17:17)
ఇతరుల నుండి సత్కారములను, గౌరములను, పూజలను అందు కొనుటకు, స్వార్ధ ప్రయోజనముల కొరకును, ఢంభముతో చేయబడునవియు, అనిశ్చితఫలములనుగాని, క్షణికఫలములను గాని ఇచ్చునవియు ఐన తపస్సులను రాజస తపస్సులు అందురు. (17:18)
మొండిపట్టుదలతో మనోవాక్కయములకు బాధకలిగించునవియు, ఇతరులకు కీడు కల్గించుటకై చేయబడునవియు, ఐన తపస్సులను తామసమని అందురు. (17:19)
దానము చేయుటయే కర్తవ్యము అను భావముతో తగిన ప్రదేశముల యందును, దుర్భిక్షాదికాలముల యందును, ఆకలిదప్పులతో బాధపడువారు, అంగవైకల్యము గలవారు, రోగులు మొదలగువారికి, పండితులు, బ్రహ్మాచారులు, వానప్రస్తులు మొదలగు పాత్రులైనవారికి ప్రత్యుపకారమును ఆశింపక నిస్వార్ధ భావముతో చేయబడు దానము సాత్వికమనబడుచున్నది. (17:20)
ప్రత్యుపకారము కొరకుగాని, ప్రతిఫలపేక్షతో గాని వివిధములగు ఒత్తిడులకు లోనైగాని బాధపడుచు విధిలేక ఇచ్చు దానమును రాజసదానము అని చెప్పబడుచున్నది. (17:21)
సద్భావములేకుండా, దానము పుచ్చుకొనువారి యెడల గౌరవాదరములను చూపక, త్రుణీకారభావముతో చీకోట్టుచు, అయోగ్యులకును, అపాత్రులకును చేయబడు దానము, దేశకాలోచితముకాని దానము తామసదానము అని చెప్పబడును. (17:22)
ఓం, తత్, సత్ అని మూడు విధములగు పేర్లు పరబ్రహ్మకు నిర్దేశింపబడినవి, ఆ పరమాత్మనుండియే సృష్ట్యాదియందు వేదములు, యజ్ఞములు నిర్మింపబడినట్లు చెప్పబడినది. (17:23)
కనుక వేదమంత్రములను పఠించువారు శాస్త్రవిహితములైన యజ్ఞదానతపస్చర్యలను సర్వదా ఓం అని పలికి ప్రారంభింతురు. (17:24)
మోక్షకాంక్షగలవారు స్వలాభాపేక్ష లేశమాత్రమైనను లేకుండా లోకహితార్ధమై యజ్ఞదానతపశ్చర్యలను ఇదియంతయును పరమాత్మదే అను భావముతో తత్ అను నామమును ఉచ్చరించుచు ఆదరించెదరు. (17:25)
అర్జునా! సత్ అను పరమాత్మనామము సత్యభావమందును, శ్రేష్టభావమందును అనగా పరమాత్ముడు నిత్యుడు, శ్రేష్టుడు అను భావము నందును ప్రయోగింపబడుచుండును. ఉత్తమకర్మాచరణమునందును సత్ అను శబ్దము వాడబడుచున్నది. (17:26)
యజ్ఞదానతపఃస్సులకు సంబందించిన నిష్ట, ఆస్తిక భావముతో సత్ అనియందురు. పరమాత్మను ఉద్దేశించి, చేయబడు నిశ్చయాత్మక కర్మలనుగూడ సత్ అని పిలువబడుచున్నది. (17:27)

అర్జునా! శ్రద్ధ లేకుండా చేయబడు హోమము ,ఇయ్యబడు దానము, ఆచరింపబడు తపస్సు, ఇంకను జరుపబడు ఇతరశుభకర్మలన్నియును, అసత్ అని చెప్పబడును. దానివలన జీవించియుండగా గాని మరణించిన పిదపగాని ఏ విధమైన ప్రయోజనముండదు. (17:28) 

No comments:

Post a Comment