అర్జునుడు
పలికెను – ఓ కృష్ణా ! అనన్యభక్తితో నిరంతరము నిన్నే భజించుచు,
ధ్యానించుచు, పరమేస్వరుడనైన నీ సుగుణరూపమును ఆరాధించువారును, కేవలము అక్షరుడవాగు
పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావముతో సేవించువారును కలరు. ఈ రెండువిధములైన ఉపాసకులలో
అత్యుత్తమ యోగులెవరు ? (12:1)
శ్రీ
భగవానుడు ఇట్లనెను – పరమేశ్వరుడనైన నాయందే ఏకాగ్రచిత్తులై నన్ను
ధ్యానించుచున్నారో, నిరంతరము నా భజనధ్యానాదులయందు నిమగ్నులై, అత్యంత శ్రద్దాభక్తులతో
నన్ను ఆరాధించు భక్తులే (అట్టివారు) నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు.
(12:2)
ఎవరైతే
సర్వవ్యాపి ఐనవాడను, మనసుకు, బుద్దికి అందనివాడును, నిశ్చలుడును, నిత్యుడును, అయిన
పరబ్రహ్మను ఉపాసింతురో వారు ఇంద్రియ నిగ్రహంకల్గి సకలప్రాణులకు హితము చేయుచు నన్నే
పొందుదురు. (12:౩,4)
కాని
పరబ్రహ్మమునందు ఆసక్తి గల చిత్తముగల్గిన వారు తత్ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి
శ్రమతో గూడినది. ఏలనన దేహాభిమానులకు అవ్యక్త పరబ్రహ్మ ప్రాప్తి అతికష్టముగా
పొండుబడుచున్నది. (12:5)
కాని
మత్పరయాణులైన ఏ భక్తులు కర్మలన్నింటిని నాయందే అర్పించి, నన్నే అనన్యభక్తియోగముతో
సతతము చింతన చేయుచు భజించుచుందురో, అట్లే నా యందు లగ్నమనస్కులైన అట్టి
పరమభక్తులకును నేను శీఘ్రముగానే మృత్యురూప సంసార సాగరమునుండి ఉద్దరింతును.
(12:6,7)
నా
యందే మనస్సును నిలుపుము. నా యందే బుద్దిని లగ్నము చేయుము. పిమ్మట నా యందే
స్తిరముగానుందువు. ఇందు ఏ మాత్రమూ సందేహం అవసరం లేదు. మనస్సును సుస్తిరముగా నాయందే
నిల్పుటకు సమర్దుడవు కానిచో అర్జునా ! అభ్యాసయోగము ద్వార నన్ను పొందుటకు
యత్నించు. (12:8,9)
అభ్యాసము చేయుటకును ఆశక్తుడవైనచో
మత్పరాయనుడవై కర్మలను ఆచరింపుము. ఈ విధముగా నా నిమిత్తమై కర్మలను ఆచరించుట ద్వార
కూడ నీవు సిద్ధిని పొందగలవు. (12:10)
భగవత్ప్రాప్తికై వలయు యోగమునాశ్రయించి
సాధన చేయుటకును నీవు ఆశక్తుడవైనచో మనోబుద్దీంద్రయాదులను వశమునందుంచుకొని,
కర్మఫలాసక్తిని వదిలి కర్మలనాచరింపుము. (12:11)
తత్త్వము నెరుంగక చేయు అభ్యాసముకంటెను
జ్ఞానము శ్రేష్టము, కేవలము పరోక్షజ్ఞానము కంటెను అనగా అనుభవ రహితమైన జ్ఞానముకంటేను
(శాస్త్ర పాండిత్యము కంటెను) పరమేశ్వరరూపధ్యానము శ్రేష్టము. ధ్యానము కంటెను
కర్మఫలత్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనన త్యాగమువలనే సంసార బంధనము తొలగి,
మోక్షప్రాప్తి సంభవించుచున్నది. (12:12)
ఏ ప్రాణియందును ద్వేషభావము లేనివాడను,
పైగా సర్వప్రాణుల యందును అవ్యాజమైనప్రేమ, కరుణ కలవాడును, మమత అహంకారములు
లేనివాడును, సుఖము ప్రాప్తించినను, సమభావము కలిగి యుండు వాడును, క్షమాగుణము
కలవాడును, సర్వకాల సర్వావస్థలయందును సంతుష్టుడై యుండు యోగియు, శరీరెంద్రియ
మనస్సులను వశము నందుంచుకొనివాడును, నాయందు ధ్రుడమైన నిశ్చయము గలవాడును, అయి నాయందే
మనోబుద్దులను అర్పణ చేసిన భక్తుడు నాకు ఇష్టుడు. (12:13,14)
లోకమున ఎవరికిని ఉద్వేగము
కలిగింపనివాడును, ఎవరివలన తను ఉద్వేగమునకు గురికానివాడును, ఈర్ష్య, భయము మున్నగు
వికారములు లేనివాడును అగు భక్తుడు నాకు ప్రియుడు.
(12:15)
ఏ మాత్రమూ కాంక్షలేనివాడును, శరీరెంద్రియమనస్సుల
యందు శుచియై యున్నవాడును, దక్షుడను, పక్షపాతరహితుడను, ఎట్టి దుఃఖములకు
చలింపనివాడును, సమస్తకర్మలయందును కర్త్రుత్వాభిమనములు లేనివాడుగు అగు భక్తుడు నాకు
మిక్కిలి ప్రియుడు. (12:16)
ఇష్టవస్తుప్రాప్తికి పొంగిపోనివాడును,
దేనియందును ద్వేషభావము లేనివాడును, దేనికినీ శోకింపనివాడును, దేనినీ
ఆశింపనివాడును, శుభాశుభకర్మలను త్యజించినవాడును ఐన భక్తుడు నాకు ఇష్టుడు. (12:17)
శత్రువులయందును, మిత్రులయందును సమభావముతో
మెలుగువాడును, మానావమానములు, శీతోష్ణములు, సుఖదుఃఖాలు మొదలగు ద్వంద్వములను
సమానముగా స్వీకరించువాడు ఆశక్తిరహితుడును, నిందాస్తుతులకు చలింపనివాడును,
మననశీలుడును, శరీరనిర్వహనకై లభించిన దానితోడనే త్రుప్తిపడు వాడును, గృహదుల యందు
మమతాసక్తులు లేనివాడును, స్తిరబుద్ది కలిగియుండు భక్తుడేవ్వడో వాడు నాకు ఇష్టుడు.
(12:18,19)
శ్రద్దావంతులైన, నన్నేపరమగతిగాభావించి,
ఇంతవరకు నే తెలిపిన ఈ ధర్మస్వరూపమైన అమృతమును ఎవరు సేవిస్తున్నారో వారు నాకు
అత్యంత ప్రియులు. (12:20).
No comments:
Post a Comment