పదకొండవ అధ్యాయం విశ్వరూపదర్శన యోగః లో, భగవానుడు
శ్రీ కృష్ణుడు , అర్జునుడికి తనే సమస్తము, తన నుంచే ఈ సమస్తము, ఈ సృష్టి స్తితిని,
గతిని , కర్త, కర్మ, క్రియ అన్నిటికిని మూల కారణమూ, అన్నియు నాలోనే వున్నవి ,
అన్నియు నా నుండే ఉద్భవిస్తున్నవి మరియు తిరిగి నాలోనే విలీనమగుచున్నవి అంతయు నేనే
అయి వున్నాను, అన్నియు నేనే అయి ఉన్నాను అని భగవానుడు తన విశ్వరూపాన్ని
దర్శనమిచ్చాడు అర్జునునికి.
పార్దా! దివ్యములై,
నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార
దర్శింపుము. (11:5)
ప్రభో కృష్ణా!
దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల
యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక
బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత
మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ
ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు
ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము. (11:15,16,20)
అర్జునా! ఈ
ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్దమునకు
సిద్దపడినవారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిందెవ్వరును లేరు. (11:32)
ఇప్పటికే ద్రోణ,
భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను
నీవు సంహరింపుము. (11:34)
అనేక భుజములు గల నీ
విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును
దర్శింప గోరుచున్నాను కృష్ణా... (11:46)
అర్జునా!
నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప
దేవతలందరునూ సదా కోరుచుందురు. (11:52)
No comments:
Post a Comment