Wednesday, February 12, 2014

పదహారవ అధ్యాయం : దైవాసురసంపద్విభాగయోగః

ఓ అర్జునా ! తేజస్సు, క్షమ, ధైర్యము, బాహ్యశుద్ది ఎవ్వరిపైనను శత్రుభావము లేకుండుట తాను పూజ్యుడనను అభిమానము లేకుండుట మొదలగునవి యన్నియును దైవీసంపద గలవాని లక్షణములు. (16:౩)
ఓ పార్దా! కపటము, దర్పము, మొండితనము, అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము మొదలగునవి అసురీ(రాక్షస) స్వభావము గలవాని లక్షణములు. (16:4)
ఓ అర్జునా ! దైవీసంపద ముక్తిదాయకము. అసురీసంపద బంధహేతువు. నీవు దైవీసంపడతో పుట్టినవాడవు. కనుక శోకింపదగదు. (16:5)
ఈ జగత్తునకు ఆధారమైనది ఏదియును లేదనియు, ఇది అసత్య మనియు, భగవంతుడనెడివాడు లేనేలేడనియు, కామప్రేరితులైన స్త్రీపురుషులసంయోగ కారణముగ జీవులు సహజముగానే పుట్టుచున్నారనియు, కావున సృష్టికి కామము తప్ప వేరొక కారణము లేదనియు అసురలక్షణములు గలవారు భావింతురు. (16:8)
అసంబద్దమైన ఇట్టి మిధ్యావాదముచేయు భౌతికవాదులు ఆత్మను గూర్చి తలంపరు. వారు మందబుద్దులు. వారు అందఱికిని అపకారము చేయుకౄరులు. వారి శక్తి సామర్ద్యములు ప్రపంచ వినాశమునకే వినియోగపడుచుండును. (16:9)
అసుర లక్షనముగల వారు ఆశాపాశాపరంపరలచే ఎల్లప్పుడును బందింపబడుచుందురు. కామక్రోధపరాయణులై ప్రవర్తించురు. విషయభోగాముల నిమిత్తమై, అన్యాయ మార్గములద్వారా ధనార్జనకు పాల్పడుచుందురు. (16:12)
నేనే గొప్ప ధనవంతుడను. మిక్కిలి పరివారము గలవాడను. నాతొ సమానుడు మరియొకడు లేడు. నేను యజ్ఞములను చేయగలను. దానముల ఇయ్యగలను.యధేచ్చగా వినోదింపగలను. అనుచు అనేక విధములుగా అజ్ఞానమోహితులై చిత్తభ్రాంతికి లోనై మొహజాలము నందు చిక్కుకొని, అసుర లక్షణములు గలవారు విషయ భోగములయందే మిక్కిలి ఆసక్తులై ఘోరనరకముల యందు పడిపోవుచుందురు. (16:16)
అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధములకు వశులై, ఇతరులను నిందించుచు తమశరీరముల యందును ఇతరశరీరముల యందును, అంతర్యామిగానున్న నన్ను ద్వేషించుచుందురు. (16:18)
అట్లు ఇతరులను ద్వేషించు పాపాత్ములను, క్రూరులైననరాధములను మాటిమాటికి ఈ సంసారమునందు అసురీయోనులలోనే నేను పదవేయుచుందును. (16:19)
కామక్రోధలోభములు అను ఈ మూడును నరకద్వారములు. అవి జీవి నాశమునకు కారణములు. మనుజుని అదోగతిపాలు చేయునవి. అనగా మరల జన్మించేల చేయుచున్నది కనుక ఈ మూడింటిని త్యజింపవలెను. (16:21)
ఓ అర్జునా! ఈ మూడు నరకద్వారముల నుండి బయటపడిన వాడు శుభకర్మలనే ఆచరించును. అందువలన అట్టివాడు పరమగతిని పొందును. అనగా నన్నే పొందును. (16:22)
శాస్త్రవిధిని త్యజించి, యధేచ్చగా విశృంఖలముగా ప్రవర్తించువాడు సుఖసిద్ధిని పొందజాలడు. అట్టివానికి ఇహపర లోకసుఖములు లభింపవు. పరమగతియు ప్రాప్తించదు, పరమపదమునందజాలడు. (16:23)

కర్తవ్యకర్మములను నిర్ణయించుటకు శాస్త్రమే ప్రమాణము. కనుక శాస్త్రోక్తకర్మలను గూర్చి బాగుగా తెలిసికొని, అట్టి కర్మలను ఆచరింపుము. (16:24).

No comments:

Post a Comment