Wednesday, February 12, 2014

పదనాలుగవ (అథ చతుర్ధశో) అధ్యాయం : గుణత్రయవిభాగయోగః

జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీస్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. (14:1)
ఈ జ్ఞానమును ఆశ్రయించినవారు నా స్వరూపమునే పొందుదురు. అట్టి పురుషులు సృష్టి కాలమందు మరల జన్మింపరు, ప్రళయకాలమున నశింపరు. (14:2)
ఓ అర్జునా ! నా మహాద్బృహ్మరూపమైన మూలప్రకృతి సర్వప్రాణులకు జన్మ స్థానము. దానియందు చేతనసముదాయ రూపమైన బీజమును ఉంచెదను. దాని వలననే సర్వభూతముల ఉత్పత్తి కలుగుచున్నది. (14:౩)
ఓ అర్జునా ! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. బీజస్థాపనచేయు నేను వాటికీ తండ్రిని. అనగా ప్రకృతియే తల్లి. నేను తండ్రిని. (14:4)
ఓ అర్జునా! ప్రక్రుతినుండి ఉత్పన్నములైన సత్త్వరజస్తమో గుణములు నాశములేని జీవాత్మను శరీరమున బందించుచున్నది. (14:5)
ఈ మూడింటిలో సత్వగుణము నిర్మలమైనది. కనుక ప్రకాశకమైనది. వికారరహితమైనది. కానీ అది సుఖమునందలి ఆసక్తి చేత, జ్ఞానాభిమానము వలన మనుజుని బందించుచున్నది. (14:6)
అర్జునా! రజోగుణము రాగాత్మకము. అది కామము, ఆసక్తుల నుండి ఉత్పన్నమగునని ఎరుంగుము. అది జీవాత్మను కర్మలయొక్కయు, కర్మఫలముల యొక్కయు ఆసక్తిని కల్పించి జీవుని బందించును. (14:7)
అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును. (14:8)
ఓ అర్జునా! సత్వ గుణము జీవుని సుఖములలో నిమగ్నము చేయును. రజోగుణము కర్మలయందు నిమగ్నునిగా చేయును. తమోగుణము జ్ఞానమును కప్పివేసి ప్రమాదులలో ముంచును. (14:9)
శరీరేంద్రియములయందును, అంతఃకరణమునందును చైతన్యము, వివేకశక్తి ఉత్పన్నములైనప్పుడు అతనిలో సత్వగుణము వ్రుద్దిచెందినందని గ్రహింపుము. (14:11)
ఓ అర్జునా! రజోగుణము వ్రుద్దియైనప్పుడు లోభము, ప్రవృత్తి (ప్రాపంచిక విషయములయందు ఆసక్తి) స్వార్ధ బుద్దితో సకామభావముతో కర్మాచరణము, అశాంతి, విషయభోగములయందు లాలస మొదలగు గుణములు కలుగును. (14:12)
ఓ అర్జునా! తమోగుణము అధికమైనప్పుడు అంతః కరణమునందును. ఇంద్రియములయందును వివేకశక్తి నష్టమగును. కర్తవ్యకర్మలయందు విముఖత, ప్రమాదము అనగా అంతః కరణమును మోహములు కలుగును. (14:13)
సత్వగుణము వ్రుద్దిచెందినపుడు మనుజుడు మరణించినచో అతడు ఉత్తమ కర్మలను ఆచరించువారు దరి చేరి నిర్మలములైన స్వర్గాది పున్యలోకములను పొందును. (14:14)
రజోగుణము వ్రుద్దిచెందినపుడు మృత్యువు ప్రాప్తించినచొ అతడు కర్మాసక్తులైన మానవులలో జన్మించును. అట్లే తమోగుణము వ్రుద్దిచెందినపుడు మృతిచెందిన మానవుడు పశుపక్షి కీటకాది నీచయోనులలో జన్మించుచున్నాడు. (14:15)
శ్రేష్టములైన కర్మలను ఆచరించుటవలన సాత్విక ఫలము అనగా సుఖము, జ్ఞానము, వైరాగ్యము మొదలగు నిర్మలఫలములు కలుగును. రాజసకర్మలను ఫలము దుఃఖము. తామస కర్మలకు అజ్ఞానము ఫలము. (14:16)
సత్వగుణము వలన జ్ఞానము, రజో గుణము వలన లోభము, తమో గుణము వలన ప్రమాదమోహదులు, అజ్ఞానము తప్పక సంభవించును. (14:17)
సత్వ గుణస్తితులు స్వర్గాది ఊర్ధ్వలోకములకు పోవుదురు. రజోగుణస్తితులైన పురుషులు మధ్య లోకమునందే వుందురు. తమోగుణ కార్యరూపములైన నిద్రా ప్రమాదాలస్యాదులయందు స్తితులైన వారు అధోగతిని పొందుదురు. (14:18)
ద్రష్టయైనవాడు గుణములే గుణములయందు వర్తించు చున్నవనియు, త్రిగుణములుతప్ప వేరుగా కర్తలు లేరనియు తెలిసికొని, త్రిగుణములకు అతీతముగానున్న నా తత్త్వమును తెలిసికొనుము. అప్పుడతను నా స్వరూపమునే పొందుచున్నాడు. (14:19)
దేహోత్పత్తికి కారణములైన ఈ మూడు గుణములను అధిగమించిన పురుషుడు జన్మ, మృత్యు, జరా (వార్ధక్య), దుఃఖములనుండి విముక్తుడై, పరమానందమును పొందుచున్నాడు. (14;20)
అర్జునుడు పలికెను ఓ ప్రభూ ! ఈ మూడు గుణములకును అతీతుడైనవాని లక్షణములెవ్వి ? అతని లోకవ్యవహారరీతి ఎట్లుండును ? మనుష్యుడు త్రిగుణములను ఎట్లు అతిక్రమించును ? (14:21)
శ్రీ భగవానుడు పలికెను ఓ పాండవా ! సత్వగుణ కార్యరూపమైన ప్రకాశము, రజోగుణకార్యరూపమైన ప్రవృత్తి, తమోగుణ కార్యరూపమైన మోహము, తమంతట తామే ఏర్పడినప్పుడు త్రిగుణాతీతుడు ద్వేషింపడు ప్రాప్తించినపుడు ఆశింపడు. (14:22)
త్రిగుణములకును, వాటి కార్యరూపములైన శరీరెంద్రియాంతఃకరణ వ్యాపారములకును ఏ మాత్రము చలింపక, త్రిగుణాతీతుడు, సాక్షివలె ఉండును. గుణములే గుణములయందు ప్రవర్తించుచున్నవని తలంచును. అతడు సచ్చిదానందఘనపరమాత్మ యందు ఏకీభావస్తితుడై యుండును. ఈ స్థితినుండి ఎన్నడును చలింపడు . (14:23)
మానావమానములయందును, మిత్రులయందును, శత్రువులయందును, సమభావముతో ప్రవర్తించువాడును, విధ్యుక్తకర్మలను ఆచరించుచు కర్త్రుత్వాభిమానము లేనివాడును, ఐనవాడును త్రిగుణాతీతుడని చెప్పబడును. (14:25)
నిర్మలమైన భక్తియోగముద్వార నన్నే నిరంతరము భజించువాడును, ఈ మూడు గుణములకు పూర్తిగా అతీతుడైనవాడును అగు పురుషుడు పరబ్రహ్మ స్వరూపమును పొందుచున్నాడు. (14:26)

ఏలనన అట్టి శాశ్వతపరబ్రహ్మకును, అమృతత్వమునకును, సనాతన ధర్మమునకును, అఖండ ఆనందమునకును నేనే ఆశ్రయుడను. (14:27).

No comments:

Post a Comment