Wednesday, February 12, 2014

పదమూడవ అధ్యాయం : క్షేత్రక్షేత్రజ్ఞవిభాగయోగః

ఓ కౌంతేయా! ఈ శరీరము క్షేత్రము అని ఎరింగిన వాడు క్షేత్రజ్ఞుడు అని తత్వజ్ఞులు తెలిపిరి. అన్ని క్షేత్రముల యందు వున్న క్షేత్రజ్ఞుడను అనగా జీవాత్మను నేనే అని తెలిసికొనుము. క్షేత్రక్షేత్రగ్నులకు సంబంధించిన జ్ఞానము అనగా త్రిగునాత్మక మైన ప్రకృతి మరియు నిర్వికారపురుషుల తత్వములను గూర్చి తెలిసికొనుటయే జ్ఞానము అని నా అభిప్రాయము. (13:1,2)
పంచమహాభూతములు, అహంకారము, బుద్ధి, మూల ప్రకృతియు, అట్లే దశేంద్రియములు, మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు. (13:5)  
ఇచ్చ, ద్వేషము, సుఖము, దుఃఖము, స్తూలశరీరము, చైతన్యము, ధృతి అను వికారములతో గూడిన దియే క్షేత్రము.   (13:6)
తానె శ్రేష్టుడను భావము లేకుండుట, డాంబికము లేకుండుట, అహింసా, క్షమించుగుణము, మనోవాక్కుల యందు సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించుట, బాహ్యభ్యంతరశుద్ధి, అంతఃకరణస్థిరత్వము, మనశ్శరీరెంద్రియములనిగ్రహము కలవాడు, ఇంద్రియార్ధములయందు వైరాగ్యము అహంకార రాహిత్యము, ఎల్లప్పుడును సమబుద్దిని కలిగియుండుట మరియు పరమేశ్వరుడైన నాయందు అనన్యయోగముద్వార అవ్యభిచారిణిభక్తీ కలిగియుండుట, ఇవన్నియు జ్ఞానప్రాప్తికై సాధనములు. దీనికి అన్యమైనదంతయు అజ్ఞానమే. (13:7-1౦)
ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును. (13:11)  
అనాదియైన పరబ్రహ్మయే తెలిసికోనదగినవాడు. అతనిని తెలిసికొనుట వలన మానవుడు పరమానందమును పొందును. అతడు సదసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గూర్చి సమగ్రముగా నీకు చెప్పుచున్నాను. (1౩:12)
అతడు ఇంద్రియగ్రాహ్యవిషయములను అన్నింటిని ఎరిగినవాడు. కాని వాస్తవముగా ఇంద్రియాదులకు అతీతుడు. ఆసక్తిరహితుడైనను సమస్తజగత్తును భరించి పోషించువాడు. అతడు గుణాతీతుడయ్యును ప్రక్రుతి సంబంధమువలన గుణములను అనుభవించుచున్నాడు. (13:14)
చరాచరభుతములన్నింటికిని బాహ్యాభ్యంతరములయందు పరిపూర్ణముగా ఉండువాడును, చరాచరరూపుడును అతడే. అతిసూక్ష్మ రూపుడైనందున తెలిసికొన శక్యముకానివాడు, అతిదూరముగను, దగ్గరగను యున్నది. (13:15)  
పరమాత్మ ఆకశామువలె విభజించుటకు వీలులేని ఒకే రూపమున పరిపూర్ణుడైయున్నను, సమస్తచరాచర ప్రాణుల రూపములలో వేర్వేరుగా గోచరించుచుండును. ఆ పరమాత్మయే భూతములను భరించునదియును, హరించునదియు, కలిగించునదియు అయివున్నది. (13:16)
ఆ పరబ్రహ్మ అన్నిజ్యోతులకును జ్యోతి, మాయాతీతుడును, జ్ఞానస్వరూపుడును, తెలిసికొనదగినవాడును, తత్వజ్ఞానముద్వార ప్రాప్యుడును అతడే. సర్వప్రాణుల హృదయములయందు ప్రకాశించుచున్నది అతడే. (13:17)
ప్రకృతి, పురుషుడు అను ఈ రెండు అనాదియైన వనియు, రాగద్వేషాదివికారములను, త్రిగునాత్మకములైన పదార్థములన్ని యును ప్రక్రుతినుండియే ఉత్పన్నములైనవనియు తెలిసికొనుము. (13:19)
ప్రకృతిని మాయ అని అందురు. కార్యకారణములను(శరీర సుఖదుఃఖాలు) ఉత్పన్నము చేయుటలో ప్రకృతియే హేతువనియు, సుఖ దుఃఖములను అనుభవించుటలో జీవాత్మయె హేతువనియు చెప్పబడినది. (13:20)             
పురుషుడు ప్రకృతిస్థుడై ప్రక్రుతినుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించుచు. ఈ గుణసాంగత్యమువలన జీవాత్మయొక్క నీచోన్నత జన్మలు కలుగుచున్నవి. (13:21)
ఈ దేహమునందు ఉన్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే, అతడు సాక్షిభూతుడగుటవలన ఉపద్రష్ట, యదార్థసమ్మతినిచ్చువాడగుట వలన అనుమంత అనియు, అన్నింటిని ధరించి, పోషించువాడు అగుటవలన భర్త అనియు, జీవరుపములో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి యగుటవలన మహేశ్వరుడు అనియు, పరమాత్మ అనియు చెప్పబడుచున్నాడు. (13:22)
ఈ విధముగా పురుషుని తత్త్వమును, గుణసహితమైన ప్రకృతితత్త్వమును తెలిసికొనినవాడు అన్ని విధములగు కర్తవ్యకర్మలను ఆచరించుచున్నప్పటికిని తిరిగి జన్మించడు. (13:23)  
కొందరు ఈ పరమాత్మను శుద్దమైన సుక్ష్మబుద్దితో ధ్యానయోగము ద్వారా తమ హృదయములయందు చూతురు. మరికొందరు జ్ఞాన యోగముద్వారాను, మరికొందరు కర్మయోగాముచేతను ఆ పరమాత్మను దర్శింతురు. (13:24)
కాని ఈ సాధనమార్గములను గూర్చి ఎరుగని మందబుద్దులు తత్త్వజ్ఞానముగల ఇతరులనుండి విని, తడనుసారముగ ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణపరాయణులును మృత్యువును దాటుచున్నారు. (12:25)
ఓ అర్జునా! ఆ స్థావరజంగమప్రాణులన్నియును క్షేత్ర-క్షేత్రజ్ఞ సంయోగమువలననే కలుగుచున్నవని గ్రహించుము. (12:26) 
నశ్వరములైన చరచారభూతముల యందు సమముగా స్థితుడైయున్న పరమేశ్వరుడు నాశరహితుడు, అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజముగా చూచువాడు. (13:27)
సమస్తప్రాణుల యందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మహంతకుడుకాడు అనగా తనను తను నాశనము చేసికోనువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందుచున్నాడు. (13:28)
సర్వకర్మలు అన్నివిధములుగా ప్రక్రుతిద్వారనే జరుగుచున్నవనియు, ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు నిజముగా చూచువాడు. (13:29)
వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నియును ఒకే పరమాత్మయందు స్థితమై యున్నవనియు, అట్లే అవి యన్నియును ఆ పరమాత్మనుండియే విస్తరించుచున్నవనియు, ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే పరబ్రహ్మను పొందుచున్నాడు. (13:౩౦)
ఓ అర్జునా! గుణనాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందు దేహాంతర్గుతుడయ్యెను. దేహాంతర్గుతుడు అయిన పరమాత్మ అనాది, నిర్గుణుడు అగుటవలన ఎట్టి కర్మలకును కర్తకాడు. కర్మలనాచరించువాడు కాదు. కనుక కర్మలచే అంటబడడు. (13:31)
సర్వత్ర వ్యాపించియున్న ఆకాశము సూక్ష్మ మగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల యందు స్థితమైయున్నను ఆత్మ నిర్గుణమగుటవలన వాటి గుణదోషములు దానికంటవు. (13:32)
అర్జునా! సూర్యుడొక్కడే యెల్ల జగత్తులను ప్రకాశిత మొనర్చునట్లు, అదే విధముగా క్షేత్రజ్ఞుడు (ఆత్మ) సర్వప్రాణులయందును స్థితమై యెల్ల  దేహములను ప్రకాశింప జేయుచున్నాడు. (13:౩౩)

ఈ విధముగా క్షేత్ర క్షేత్రజ్ఞుల మధ్యగల అంతరమును, కార్యసహిత ప్రక్రుతినుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వార ఎరింగిన మహాత్ములు మోక్షమును పొందుచున్నారు. (13:34)

No comments:

Post a Comment