Wednesday, February 12, 2014

ఐదవ అధ్యాయం - కర్మసన్యాస యోగః

అర్జునుడు పలికెను ఓ కృష్ణా ! ఒకసారి కర్మసన్యాసమును, మరియొకసారి కర్మయోగమును ప్రశంసించున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో తెలియజేయుము. (5:1)
అప్పుడు భగవానుడు, అర్జునా! కర్మసన్యాసము, కర్మయోగము అను ఈ రెండును మోక్షమును కలుగజేయును. కానీ ఈ రెండింటిలోను కర్మసన్యాసం(కర్మ పరిత్యాగము) కంటెను కర్మయోగము(కర్మానుష్టానమే) శ్రేష్టమైనది. (5:2)
ఓ మహాబాహో! ఎవరిని ద్వేషింపని, దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్యసన్యాసిగా ఎరుంగవలెను. ఏలనన రాగాద్వేషాది ద్వంద్వందములు లేనివాడు అవలీలగా సంసారబంధముల నుండి విముక్తడగును. (5:౩)
సాంఖ్య, కర్మయోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని అవివేకులు పలికెదరు. పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా ఆచరించినవాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందుచున్నాడు. (5:4)
జ్ఞానయోగులు పొందు మోక్షమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞానయోగఫలమును, కర్మఫలయోగమును ఒక్కటిగా చూచువాడే నిజముగా గ్రహించినవాడగును. (5:5)
ఓ అర్జునా! కర్మయోగమును అనుస్టింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరములద్వార జరుగు కర్మలన్నింటి యందును కర్త్రత్వమును త్యజించుట కష్టము. భగవత్సరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందుచున్నాడు. (5:6)
కర్మయోగము నాచరించువాడు మనస్సును వశమునందుంచుకొనినవాడు, జితేంద్రియుడు, అంతఃకరణసుద్ది కలవాడు, సర్వప్రాణులలో అత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మకలవానికి కర్మలను ఆచరించుచున్నను వాటిచేత అంటబడడు. (5:7)
పరమార్దతత్వమును నెరిగిన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్ప్రుశించుచు, ఆఘ్రాణించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాస క్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరుచుచు, మూయుచు ఉన్నను ఇంద్రియములు తమతమ విషయముల యందు వర్తించుచున్నవనియు, తనేమియు చేయుటలేదనియు తలంచును. (5:8.9)
ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక కర్మలన్నింటిని భగవదార్పనము గావించి కర్మల నాచరించునో, ఫలాశక్తిరహితముగా కర్మలనాచరించు వాడు తామరాకుకు నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు. (5:10)
కర్మయోగులు ఫళాశక్తిరహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వార అంతఃకరణ శుద్దికై కర్మలను ఆచరించుచున్నారు. (5:11)
నిష్కామకర్మయోగి కర్మఫలమును త్యజించి, భాగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు కర్మలనాచరించి బద్దుడగు చున్నాడు.  (5:12)
ఇంద్రియ నిగ్రహముతో నవద్వారములుగల శరీరమునందు సమస్తకర్మలను మానసికముగా త్యజించి, పరమాత్మస్వరూపమున స్థితుడై, ఆనందమును అనుభవించుచున్నాడు. (5:13)
భగవంతుడు జీవుల యొక్క కర్త్రుత్వమునుగని, వారి కర్మలనుగని, కర్మఫలసంయోగామును గాని సృజింపడు. ఈ యన్నింటిలో ప్రకృతియే ప్రవర్తించుచున్నది. సర్వవ్యాపియైన భగవంతుడు ప్రాణుల పుణ్యపాపకర్మలలో దేనికిని భాగస్వామి కాదు. అజ్ఞానముచే జ్ఞానముకప్పబడి యుండుటవలన ప్రాణులు భ్రమకి లోనగుచున్నారు. (5:14,15)
ఎవని అజ్ఞానము, జ్ఞానము(పరమాత్మ తత్వము) చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును. (5:16)
పరమాత్మయందే నిరంతరము ఏకీభావముతో స్తితులై, తత్పరయానులైన పురుషులు జ్ఞానసాధనతో పాపరహితులై, పునరావ్రుత్తిరహితమైన శాశ్వత పరమగతిని పొందుచున్నారు. (5:17)
విద్యవినయ సంపన్నుడైన బ్రాహ్మణునియందును, గోవు, ఏనుగు, కుక్క మొదలగు వానియందును, చండాలుని యందును సమదృష్టిని గలవానినే జ్ఞానీ అందురు. (5:18)
ఎవరి మనస్సు సమభావమందు స్తిరమై యున్నదో అట్టివారు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు. అనగా ప్రాపంచిక విషయాతీతస్తితికి చేరుదురు. పరమాత్మ దోషరహితుడు, సముడు, అందువలన సమభావస్తిత మనస్కులైన వారు బ్రహ్మమునందున్న వారెయగుదురు. (5:19)
స్థిరమైన బుద్దిగలవాడును, మొహవివశుడు అయిన బ్రహ్మవేత్త ఇష్టమైన దానిని పొందినపుడు సంతోషముగాని, అనిష్టమైన దానిని పొందినప్పుడు దుఃఖముగాని పొందడు. (5:20)
ప్రాపంచిక విషయములయందు అనాసక్తమైన అంతఃకరణముగల సాధకుడు ఆత్మస్తితిధ్యాన జనితమైన సాత్వికాత్మానందమును పొందును. పిదప అతడు బ్రహ్మనిష్ఠయను సమాధితో గూడుకొనినవాడై, అక్షయమగు సుఖమును పొందుచున్నాడు. (5:21)
ఓ అర్జునా! విషయే0oద్రియ సంయోగమువలన ఉత్పన్నములగు భోగములన్నియును భోగలాలసులకు సుఖములుగా భాసించినను అవి నిస్సందేహముగా దుంఖఃహేతువులే. ఆధ్యంతములు గలవి. అనగా అనిత్యములు. వివేకి వాటియందు ఆసక్తుడు కాడు. (5:22)
ఎవరు ఈ శరీరము విడువకముందే అనగా జీవించి యుండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులో నుంచుకోనునో (అరిషడ్వర్గములను జయించునో) అతడే నిజమైన ఆత్మానంద యోగి. (5:23)
ఎవరు అంతరాత్మయందే సుఖించుచు, అత్మయందే రమించునో, అట్టి ఆత్మజ్ఞానియైన సాంఖ్యయోగి, పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావస్తితుడై యుండునో అతడు బ్రహ్మ సాక్షాత్కారము పొందును. (5:24)
పాపరహితులును, జ్ఞానప్రభావమున సమస్తసంశయములను నివృత్తిని సాధించినవారు, సర్వప్రాణులహితమును గోరు ఋషులు, బ్రహ్మనిర్వాణ మును పొందుచున్నారు. (5:25)
కామక్రోధములు లేనివారు, మనోనిగ్రహము కలవారును అయి, పరబ్రహ్మపరమాత్మ సాక్షాత్కారము పొందిన జ్ఞానులకు అంతటను పరబ్రహ్మపరమాత్మయే గోచరించును. (5:26)
బాహ్య విషయభోగములను చింతచేయక వాటిని పారద్రోలవలెను. దృష్టిని భ్రూమద్యమునందును స్తిరముగా ఉంచవలెను. నాసికయందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్తితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఎవడు ఈ విధముగా ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబిమపజేసి, మనస్సును, బుద్దిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో అట్టివాడే ముక్తుడనబడును ఇట్టి సాధనలవలన మోక్షపరాయణుడైన సాధకుడు ఇచ్చాభయక్రోధరహితుడై ఎల్లప్పుడూ ముక్తుడగును. (5:27,28)

భగవంతుడు సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగను, సకల ప్రపంచ నియామకునిగను, ఇట్టి భగవత్తత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. ఆ విధముగా నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు (5:29)

ఆరవ అధ్యాయం : ఆత్మసంయమ(ధ్యాన)యోగః

శ్రీ భగవానుడు పలికెను – కర్మఫలమును ఆశ్రింపక కర్తవ్యకర్మలను ఆచరించువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. కానీ కేవలం అగ్ని కార్యములను త్యజించినంత మాత్రమున సన్యాసియుకాడు. (6:1)
అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అందురు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగికాజాలడు. (6:2)
యోగరూడస్తితిని పొందగోరు మననశీలుడైన పురుషునకు నిష్కామకర్మాచరణము వలననే యోగప్రాప్తి కలుగును. యోగరూడుడైన పురుషునకు సర్వసంకల్పరాహిత్యమే మోక్షప్రాప్తికి మూలము. (6:౩)
ఇంద్రియభోగములయందు, కర్మలయందును ఆసక్తినుంచక సర్వసంకల్పములను త్యజించిన పురుషుడు యోగరూడుడనబడును. (6:4)
మనుజులు ఈ సంసారసాగరము నుండి తమకు తామే ఉద్దరించు కొనవలెను. తమకుతామే అధోగతిపాలుకారాదు. లోకములో వాస్తవముగా తమకు తామే మిత్రులు, తమకు తామే శత్రువులు. (6:5)
ఎవరు తన మనస్సును జయించునో అట్టి వాని మనస్సు బంధువులా ఉపకారిలా ఉండును. మనస్సును జయింపనిచో అది శత్రువై అపకారము చేయును. (6:6)
శీతోష్ణములు, సుఖదుఃఖములు, మానావమానములు మున్నగు ద్వంద్వములయందు అంతఃకరణవృత్తులు నిశ్చలముగా వుండి, స్వాధీనమైన ఆత్మగల పురుషుని జ్ఞానమందు పరమాత్మ చక్కగా స్థితుడై యుండును. (6:7)
యోగియొక్క అంతఃకరణము నందు జ్ఞాన విజ్ఞానములు నిండియుండును. అతడు వికారరహితుడు. ఇంద్రియాదులను పూర్తిగా వశపరచుకొనిన వాడు. అతడు మట్టిని, రాతిని, బంగారమును సమానముగా చూచును. (6:8)
సుహ్రుదులయందును, మిత్రులయందును, శత్రువులయందును, ఉదాసీనులయందును, మధ్యస్తులయందును, ద్వేషింపదగిన వారియందును, బందువులయందును, ధర్మాత్ములయందును, పాపులయందును, సమబుద్ది కలియుండువాడు మిక్కిలి శ్రేష్టుడు. (6:9)
శరీరేంద్రియమనస్సులను స్వాధీనపరచుకొనినవాడు, ఆశారహితుడు, వ్రతుడు అయిన యోగి ఒంటరి ప్రదేశమున కూర్చొని, నిరంతరం అత్మయందే ధ్యాననిష్టయందుండవలెను. (6:10)
చిత్తెంద్రియవ్యాపారములను వశము నందుంచుకొని, ఏకాగ్రతగల మనస్సుతో తననాసికాగ్రభాగమునందే దృష్టిని నిలిపి  అంతఃకరణశుద్దికై యోగాభ్యసమును సాధనచేయవలెను. (6:12,13)
ధ్యానయోగి ప్రశాంతాత్ముడై, భయరహితుడై, బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు, మనోనిగ్రహముతో నాయందు చిత్తము గలవాడై, నన్నే పరమ గతిగ నమ్మి నిశ్చలుడైయుండవలెను. (6:14)
మనోనిగ్రహశాలియైన యోగి నిరంతరము పరమేశ్వరుడైన నా స్వరూపమునందే ఆత్మను ఈ విధముగ లగ్నమొనర్చి, నాయందున్న పరమానందమునకు పరాకాష్ఠరూపమైన శాంతిని పొందుచున్నాడు. (6:15)
మితాహారము, కర్మలయందు మితమైన ప్రవర్తన గలవాడును, మితమైన నిద్రగల మనుజునకు ఆత్మసంయమ యోగము లభ్యము. (6:17)
చిత్తమును పూర్తిగా వశమునందుంచుకొని, దానిని అత్మయందే స్థిరముగా నిల్చినపుడు పురుషుడు సర్వభోగములయందు స్ప్రుహారహితుడగును. అప్పుడతడు యోగయుక్తుడగుచున్నాడు. (6:18)
గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. (6:19)
ధ్యానయోగాసాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరతిని పొంది, పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మ బుద్దితో, ఆ భగవానుని సాక్షాత్కరింప జేసికొని, యోగి ఆ పరమాత్మయందే సంతుస్టుడగుచున్నాడు. (6:20) 
బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది. పవిత్రమైన సుక్ష్మబుద్ది ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందము అనుభవించుచు దానియందే స్థితుడైయున్న యోగి పరమాత్మ స్వస్వరూపమునుండి ఏ మాత్రము చలింపడు.  (6:21)
పరమాత్మ ప్రాప్తిరూపలాభములు పొందినవాడు, ఏ ఇతర లాభములను గూడ దానికంటె అధికమైన దానినిగా తలంపడు. బ్రహ్మానందానుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవదుఃఖ ములును చలింపజేయజాలవు. (6:22)
దుఃఖరూపసంసారబంధముల నుండి విముక్తిని కలిగించు ఈ భాగవత్సాక్షాత్కారరూపస్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన, ఉత్సాహపూరిత మైన విసుగులేని చిత్తముతో నిశ్చయముగా అభ్యాసము  చేయవలెను. (6:23)
సంకల్పమువలన కలిగిన కోరికలన్నింటిని నిశ్శేషముగా త్యజించి ఇంద్రియ సముదాయములను అన్ని విధములుగ మనస్సుతో పూర్తిగా నిగ్రహింపవలెను. (6:24)
క్రమక్రమముగా సాధనచేయుచు ఉపరతిని పొందవలెను. ధైర్యముతో బుద్దిబలముతో మనస్సును ఆత్మయందు స్థిరమొనర్చి, పరమాత్మను తప్ప మరీ ఏ ఇతర విషయమును ఏ మాత్రమూ చింతనచేయరాదు . (6:25) 
సహజముగా నిలకడలేని చంచలమైన మనస్సును ప్రాపంచిక విషయముల యందు విశృంఖలముగా పరిభ్రమించు చుండును. అట్టి మనస్సును ఆయా విషయములనుండి పదే పదే మరల్చి, దానిని అత్మయందే స్థిరముగా నిలుపవలెను. (6:26)
ప్రశాంతమైన మనస్సు కలవాడును, పాపరహితుడును, రజోగుణము శాంతమైనవాడును, అనగా ప్రాపంచిక కార్యములయందు ఆసక్తి తొలగినవాడును, పరమాత్మయందు ఏకీభావమును పొందినవాడును అగు యోగి బ్రహ్మానందమును పొందుచున్నాడు. (6:27)
పాపరహితుడైన ఆ యోగి పుర్వోక్తరీతిగా నిరంతరము పరమాత్మయందే లగ్నమొనర్చుచు, పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తిరూపమైన అపరిమిత ఆనందమును హాయిగా అనుభవించును. (6:28)
సర్వవ్యాప్తమైన అనంతచైతన్యమునందు ఏకీభావస్థితిరూప యోగ యుక్తమైన ఆత్మగలవాడును, అంతటను అన్నింటిని సమభావముతో చూచువాడును అగు యోగి తనయాత్మను సర్వప్రాణులయందు స్తితమైయున్నట్లుగాను, ప్రాణులన్నింటిలోను తన ఆత్మనే దర్శించుచున్నాడు. (6:29)
భగవంతునియందు ఏకీభావస్తితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపముననున్న నన్ను భజించును. అట్టి యోగి సర్వధా సర్వవ్యవహారములయందు ప్రవర్తించుచున్నను నాయందే ప్రవర్తించు చుండును. (6:31)
ఓ అర్జునా! సర్వప్రాణులను తనతో సమానముగా చూచు వాడును, సుఖమునుగాని, దుఃఖమునుగాని సమముగా సమానముగా చూచువాడును ఇతరుల సుఖ దుఃఖములను తన సుఖ దుఃఖాములుగా భావించుచుండును అయిన యోగి పరమశ్రేష్టుడు అని చెప్పబడుచున్నాడు. (6:32)
అర్జునుడు... ఓ కృష్ణా! ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, బాగుగా మదించు స్వభావము గలది. మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట అంటే గాలిని ఆపుటనువలె మిక్కిలి దుష్కరమని నాకు తోచు చున్నది. (6:34)
ఓ అర్జునా! నిస్సందేహముగా మనస్సు చంచలమైనదే. దానిని వశపరచుకొనుట మిక్కిలి కష్టము(దుస్సాధ్యమే). అయిన దానిని  అభ్యాసవైరాగ్యముల ద్వార మనసును నిరోధింపవచ్చును. (6:35)
మనస్సును వశపరచుకొనని పురుషునకు యోగసిద్ది కలుగుట కష్టము. కాని మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైన పురుషుడు సాధన ద్వార సహజముగా యోగసిద్దిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము. (6:36)
ఓ కృష్ణా! యోగమునందు శ్రద్ధతో యోగసాధన చేయుచు మనస్సు వశమునందుండని కారణమున అవసానదశలో మనస్సు చలించి, అత్మసాక్షాత్కారమును పొందకయే మరణించిన సాధకుని గతియేమగును? (6:37)
ఓ పార్దా! అట్టి పురుషుడు ఈ లోకమున గాని, పరలోకమున గాని అదోగాతిపాలుకాడు. ఆత్మోద్దారణమునకు అనగా భగవత్ప్రాప్తికోరకై కర్తవ్య కర్మలను ఆచరించు వాడేవ్వడును దుర్గతి పాలుగాడు గదా! (6:4౦)
అర్జునా! యోగభ్రస్టుడు పుణ్యాత్ములు పొందు లోకములను అనగా స్వర్గాది ఉత్తమ లోకములను పొంది, ఆయా లోకములలో పెక్కు సంవత్సరములు గడిపిన తర్వాత పవిత్రులైన సంపన్నుల గృహమున జన్మించును. (6:41)
లేనిచో విరాగియైన పురుషుడు ఆ పుణ్య లోకములకు పోకుండగానే జ్ఞానుకైన యోగులకుటుంబంలోనే జన్మించును. కాని లోకమునందు ఇట్టి జన్మ ప్రాప్తించుట మిక్కిలి దుర్లభము గదా. (6:42)
అచట యోగి ఆ కుటుంబమున పుట్టిన పిదప పూర్వదేహమున సాధించిన బుద్ధి సంయోగమును అనగా సమబుద్దిరూపయోగ సంస్కారములను అతడు సులభముగనే పొందును. ఓ కురునందనా! ఆ బుద్ధి సంయోగ ప్రభావమున అతడు మరల పరమాత్మ ప్రాప్తి సిద్దించుటకై మునుపటి కంటెను అధికముగా సాధన చేయు చున్నాడు. (6:4౩)
కాని, ప్రయత్నపుర్వకముగా యోగసాధనచేయు యోగి అనేక జన్మలసంస్కారముల ప్రభావమున ఈ జన్మయందే సిద్ధిని పొంది, సంపూర్ణముగా పాపరహితుడై, తక్షణమే పరమ పదమును పొందును. (6:45)
ధ్యాన యోగి తాపసులకంటేను, జ్ఞానులకంటేను శ్రేష్ఠుడు . సకామకర్మలాచరించువారికంటేను శ్రేష్టుడని భావింపబడును. (6:46)

యోగులందరిలో శ్రద్దాలువై, అంతరాత్మను నాయందే లగ్నమొనర్చి, అనగా భక్తివిస్వాసములతో నిశ్చలమైన, ధ్రుడమైన అనన్య భావముతో నాయందే స్తిరమైయున్న మనోబుద్దిరూప అంతఃకరణమును గలిగి, నిరంతరము నన్నే భజించువాడు సమస్త యోగులలో ఉత్తముడు . (6:47).

ఏడవ అధ్యాయం : జ్ఞానవిజ్ఞానయోగః

ఓ అర్జునా! అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలిగినవాడై, అనన్య భావముతో మత్పరాయణుడై, యోగమందు నిమగ్నుడవై, సంపూర్ణ విభూతిబల ఐస్వర్యాదిగుణ యుక్తుడవై, సర్వప్రాణులకును ఆత్మస్వరూపుడను అయిన నన్ను నిస్సందేహముగా తెలిసికొనగలవో, ఆ విధమును తెలిపెదను వినుము. దీనిని ఎరిగిన పిమ్మట ఈ జగత్తులో తెలిసికొనవలసినది ఏదియు మిగులదు (7:1,2)
వేలకొలది మనుష్యులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలోగూడా ఒకానొకడు మాత్రమే నా యదార్థమును (తత్వమును) తెలుసుకొన గలుగుచున్నాడు. (7:౩)
ఓ మహోబాహొ! భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి మరియు అహంకారము అని నా ప్రక్రుతి ఎనిమిది విధములుగా కలదు. ఎనిమిది భేదములు గల ఈ ప్రకృతిని అపరా లేక జడ ప్రక్కృతి అని అందురు. (7:4)
ఇదిగాక ఈ సంపూర్ణ జగత్తును ధరించునట్టి మరియొక ప్రకృతి కలదు. అదియే నా జీవరూప పరాప్రకృతి అని తెలిసికొనుము. (7:5)
ఓ అర్జునా! సమస్త ప్రాణులను ఈ రెండు విధములైన ప్రకృతులనుండియే పుట్టుచున్నవి. ఈ జగత్తు యొక్క పుట్టుకయు వినాశనము నా వలననే జరుగుచున్నవి. అనగా ఈ సంపూర్ణ జగత్తునకు నేనే కారకుడను. (7:6)
అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియు ప్రపంచమున లేదు. నాకంటె పరమమైనది ఏదియును లేదు. ఈ జగత్తునందలి వస్తువులన్నియును సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది. (7:7)
ఓ అర్జునా! జలములలో రసతన్మాత్రను నేనే. సుర్యచంద్రులలో కాంతిని నేనే. వేదములన్నింటిలోను ఓంకారమును, ఆకాశము నందు శబ్దమును, మానవులయందు పౌరుషమును, పృథ్వి యందు పవిత్రగ్రంధము, అగ్నియందు తేజస్సును, సమస్త ప్రాణులలో జీవశక్తిని, తాపసులలో తపస్సును నేనే అయియున్నాను (సర్వమూ నేనే అయివున్నాను). (7:8,9)
ఓ పార్థా! సమస్త భూతములకును నన్ను శాశ్వత మైన బీజముగా ఎరుంగుము. ప్రజ్ఞావంతులలో ప్రజ్ఞను, తేజోవంతులలో తేజస్సును నేనే. (7:10)
సాత్విక, రాజస, తామస భావములన్నియును నా నుండియే కలుగుచున్నవి తెలిసికొనుము. కానీ! యధార్థముగా వాటిలో నేను గాని, నాలో అవిగని లేవు. అనగా నేను త్రిగుణాతీతుడను. (7:12)
ఈ జగత్తు అనగా ప్రాణిసముదాయము అంతయును గుణముల యొక్క కార్యరూపములైన సాత్విక, రాజస, తామసములు అను త్రివిధ భావములచే మొహితమగు చున్నది. కనుక త్రిగుణములకు అతీతుడను శాస్వతుడను అయిన నన్ను ఆ ప్రాణులు తెలిసికొనలేకున్నవి. (7:13)
నా మాయ త్రిగునాత్మకమైనది. అలౌకికమైనది. ఇది అధిగమించుటకు సాధ్యము కానిది. కానీ కేవలం నిరంతరమూ నన్నే భజించువారు ఈ మాయను సునాయాసంగా దాటుచున్నారు. (7:14)
మాయలో చిక్కుపడుట వలన విపరీత జ్ఞానమునకు లోనైన వారును, రాక్షస ప్రవ్రుత్తిగల వారును, నరాధములును, మూడులును, దుష్కర్మలను ఆచరించువారును నన్ను భజింపరు. (7:15)
ఆర్తులు(శుభాశుభ కర్మలు చేయుచు చరించుచు సుఖసంపదలను కోరుకోనువారును), జిజ్ఞాసులు(ఐహిక విషయములపై ఆశక్తిని వీడి పరమాత్మతతత్త్వ జ్ఞానమును పొందుటకు ఇచ్చగలవారు), అర్ధకాములు(శారీరక మానసిక సంతాపములకు గురియైన ఆర్తులు), జ్ఞానులు(పరమాత్మప్రాప్తినందిన) అను నాలుగు విధములైన భక్తులు నన్నాశ్రయించుచున్నారు.
(7:16)  
ఈ చతుర్విధభక్తులలో నిరంతరము నాయందే ఏకీభావ స్తితుడై, అనన్య భక్తియుతుడైన జ్ఞానీ అత్యుత్తముడు. ఏలనన వాస్తవముగా నా తత్త్వమును తెలిసికోనిన జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టుడను. అతడును నాకు అత్యంత ప్రియుడైయున్నాడు. (7:17)
ఈ చతుర్విధభక్తులందరును ఉదారులే. కానీ జ్ఞానియైన వాడు నా స్వరూపమే. ఇది నా అభిప్రాయము. ఏలనన అట్టి భక్తుడు తన మనస్సును బుద్దిని నాయందే స్తిరముగా ఉంచి నన్నే ఉన్నతగతి స్వరూపునిగా భావించును. ఈ విదముగా అతడు నా యందే స్థిరముగా ఉన్నాడు. (7:18)
జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మము లెత్తిన పిదప విజ్ఞానియై భగవత్తత్వమును ఎరిగి, సర్వమూ వాసుదేవమయమే (పరమాత్మమయమే) యని భావించి, నన్ను శరణుపొందును. (7:19)
అనేకవిధములైన భోగవాంఛలలో కూరుకొనిపొయినవారి జ్ఞానం అంతరించిపోవుచు. వారు తమతమ స్వభావములకు అనుగుణముగా వారివారి నియమములను బట్టి ఇతర దేవతలను ఆరాధించురు. (7:20)
అల్పబుద్దులగు భక్తులు పొందేది ఫలములు గూడా అల్పములే. ఇతర దేవతలను పుజించువారు ఆ దేవతలనే చేరుదురు. ఎవరైతే నా స్వస్వరుపాన్ని(పరమాత్మను) గ్రహించి వారి మనసు నా యందు లగ్నం చేస్తారో వారు నన్నే పొందుచున్నారు. (7:23)
నేను శాశ్వతుడను, సర్వోత్తముడను, ఇంద్రియములకును, మనస్సునకును కనబడనివాడను. నా పరమభావమును బుద్దిహీనులు గ్రహింపక, ఇట్టి నన్ను సాధారణ మనుస్యునిగా తలంచుచున్నారు.  (7:24)
నా యోగమాయవలన నేను అందరికి గోచరింపను. కనుక అజ్ఞానులు నన్ను జన్మరహితునిగా, శాస్వతునిగా, పరమేస్వరునిగా తెలుసుకొనలేరు. (7:25)
ఓ అర్జునా! గతించినకాలమునకు చెందినట్టివియు, ప్రస్తుత కాలమునందు ఉన్నట్టివియు ఐన చరాచర ప్రాణులన్నింటిని నేను ఎరుగుదును. అంతేకాదు రాబోవు కాలమున జన్మించు ప్రాణులను గుర్చియు నేను ఎరుగుదును. కాని నాయందు భక్తిశ్రద్దలు గలవారు తప్ప వేరెవ్వరు నన్ను ఎరుగరు. అయితే నాయందు శ్రద్దలేని వాడు నన్ను ఎరుంగడు. (7:26) 
ఓ అర్జునా! జగత్తునందు ప్రాణులన్నియును రాగద్వేషముల వలన కలిగిన సుఖదుఃఖాదిద్వంద్వముల ప్రభావము వలన అంతులేని మొహములో పడిపోవుచున్నవి.కానీ నిష్కామభావముతో పుణ్యకర్మలను ఆచరించు పురుషుల పాపములు నశించును అట్టివారు రాగద్వేషజనితములైన సుఖదుఃఖాది రూపమోహముల నుండి విముక్తులయ్యేదరు. ద్రుడనిశ్చయము గల్గిన అట్టి భక్తులు అన్నివిధముల నన్నే భజింతురు. (7:27,28)
నన్ను సరణుపొంది జరామరణవిముక్తికై ప్రయత్నించు వారు ఆ పరబ్రహ్మను, సంపూర్ణ ఆధ్యాత్మమును, సంపూర్ణ కర్మను తెలిసికొందురు. (7:29)

ఆదిభూత, ఆధిదైవ, ఆధియజ్ఞములతోపాటు అందరికిని ఆత్మరూపుడైన నన్ను అంత్యకాలమునందైనను తెలిసికొనువారు నిశ్చల బుద్దితో నన్నే చేరుదురు. (7:౩౦)

ఎనిమిదవ అధ్యాయం : అక్షరపరబ్రహ్మయోగః

అర్జునుడు పలికెను ఓ పురుషోత్తమా ! బ్రహ్మ అనగా ఏమి? అధ్యాత్మము అనగానేమి? కర్మ అనగా నేమి ? అధిభూతము అని దేనికి పేరు ? అధిదైవము అని దేనిని అందురు. ఓ మధుసూధనా! అధియజ్ఞము అనగానేమి? ఆ అధియజ్ఞము ఈ శరీరమునందు ఎట్లుండును? అంత్యకాలమున మనస్సును నిగ్రహముచేసిన యోగులు నిన్నెట్లు తెలిసికోనగలరు ? (8:1,2)
శ్రీభగవానుడు పలికెను బ్రహమనగా సర్వశ్రేష్టుడు, శాశ్వతుడు. అధ్యాత్మము అనగా బందనాలైన జీవము ఆత్మయందు లీనమైన సకల భూతములను బహిర్గతమొనర్చి, వాటి ఉత్పత్తి అభ్యుదయములకు కారణములైన చేష్టను అనగా సృష్ట్యాదికర్మలను కర్మమనుబడుచున్నది. (8:౩)
ఓ అర్జునా! ఉత్పత్తి వినాశశీలములైన పదార్థములన్నియు అధిభూతములు అనబడును. హిరణ్మయుడైన పురుషుడు అధిదైవము దేహధారులలో శ్రేష్టుడైన ఈ శరీరములలో అంతర్యామిగా ఉన్న నేనే వాసుదేవుడనే అధియజ్ఞమును. (8:4)
ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే నన్నే పొందును. ఇందేమాత్రము గూడ సంశయం వలదు (8:5)
కౌంతేయ ! మనుష్యుడు అవసానదశయందు ఏ ఏ భావములను స్మరించుచు దేహత్యాగము చేయునో అతడు మరుజన్మలో ఆయా స్వరూపము పొందుచున్నాడు. (8:6)
కావునా ఓ అర్జునా! నీవు సదా సర్వదా నన్నే స్మరించు చుండుము. యుద్దమున గూడ చేయుము. నీ బుద్దిని మనస్సును నాయందే నిల్పియున్నచో నిజముగా నన్నే పొందెదవు. (8:7)
మనస్సునందు వేరే ధ్యాస ఏ మాత్రమూ లేకుండా నిరంతరము పరమేశ్వరుని ధ్యానరూపయోగమునే సాధనచేయు మనుష్యుడు దివ్యపురుషుడైన పరమాత్మనే చేరును. (8:8)
సర్వజ్ఞ్నుడును, సనాతనుడును, అందరిని శాసించువాడును, అణువు కంటెను సుక్ష్మమైనవాడును, సర్వప్రాణులను పోషించు వాడును, అచింత్య రూపుడును, సూర్యునివలె నిత్యచేతన ప్రకాశరూపుడును, అజ్ఞానాంధకారమును పారద్రోలువాడును అయిన పరమేశ్వరుని స్మరించు వాడగు అట్టి పరమభక్తుడు అంత్యకాలమునందు యోగబలము చేత భ్రుకుటి మధ్యమున ప్రాణములను స్తిరముగా నిలిపి, నిశ్చలమైన మనస్సుతో స్మరించుచు దివ్యరూపుడును, పరమపురుషుడును, అయిన పరమాత్మనే చేరును. (8:9,10)
వేదవిదులైన విద్వాంసులు ఆ పరమాత్మను శాశ్వతుడు అని ప్రస్తుతింతురు.ఆశక్తి రహితులై, యత్నశీలురైన సన్యాసులు ఆ పరమపదమునందే ప్రవేసింతురు. ఆ పరమపదమును కొరియే బ్రహ్మచారులు బ్రహ్మచర్యవ్రతమును ఆచరింతురు. అట్టి పరమపదమును గూర్చి సంగ్రహముగా నేను నీకు వివరింతును. (8:11)
సర్వెంద్రియాలను నిగ్రహించి, మనస్సును హృదయమునందే స్థిరముగా నిలిపి, అట్లు వశమైన మనస్సుద్వార ప్రాణములను సహస్రారమునందు స్థిరమొనర్చి పరమాత్మ ధ్యానమునందే నిమగ్నుడై అక్షర బ్రహ్మస్వరూపమైన ఓంకారమును ఉచ్చరించుచు, ఆ ఓంకారమునకు అర్ధస్వరుపుడను, నిర్గునబ్రహ్మను ఐన నన్ను చింతించుచు దేహత్యాగమొనర్చువాడు మోక్షమును పొందుచున్నాడు. (8:12,13)
పార్థా! నిత్యము అనన్యభావముతో చిత్తమును నాయందే నిలిపి, పురుషోత్తముడనైన నన్నే స్మరించుచు, సంతతము మత్పరాయణుడైన యోగికి నేను సులభుడను. అనగా అతనికి నేను సులభముగా లభింతును. (8:14)
పరమసిద్దిని పొందిన మహాత్ములు నన్ను చేరిన పిదప దుఃఖములకు నిలయమైన, క్షణభంగురమైన పునర్జన్మను తిరిగి పొందరు.  (8:15)
అర్జునా! బ్రహ్మలోక పర్యంతము ఉన్న సమస్త లోకములును పునరావ్రుత్తములు. కనుక నన్ను చేరినవానికి పునర్జన్మ లేదు. (8:16)
వేయి చతుర్యుగముల కాలము బ్రహ్మకు ఒక పగలు అనియు, అదే కాలము ఆ బ్రహ్మకు ఒక రాత్రియనియు తెలిసిన యోగులు కాలతత్వమును నిజముగా ఎరిగినవారు.చరాచర ప్రాణులన్నియు బ్రహ్మయొక్క పగటి కాలము ప్రారంభము కాగానే అవ్యక్తమునుండి ఉత్పన్నములగును. మరల బ్రహ్మయొక్క రాత్రికాలము ప్రారంభ సమయమున అవి అదే అవ్యక్తమునందు లీనమగును. (8:17,18)
పార్థా! ఈ ప్రాణి సముదాయము ప్రక్రుతివశమున మాటిమాటి కిని ఉత్పన్నమగుచుండును. రాత్రి ప్రారంభకాలమున లీనమగుచుండును. మరల పగటి ప్రారంభ కాలమున పుట్టుచుండును. ఆ అవ్యక్తముకంటెను పరమైన విలక్షణమైన సనాతనమైన అవ్యక్తభావమే ఆ పరమపదము. ప్రాణులన్నియు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు. ఈ అవ్యక్తమునే అక్షరము అనియు అందురు. ఇదియే పరమగతి అని, పరమపదము అనియు అందురు. ఈ సనాతన అవ్యక్తము అనగా నా పరంధామమును చేరిన (మోక్షమును పొందిన) వారు మాత్రం మరల జన్మించరు. (8:19-21)
ఓ పార్థా! సమస్త ప్రాణులు ఆ పరమాత్మ యందె అంతర్గములై యున్నవి. ఆ పరమాత్మచేతనే ఈ జగత్తంతయు వ్యాప్తమై వున్నది. అట్టి సనాతన అవ్యక్త పరమ పురుషుడు అనన్య భక్తి ద్వార మాత్రమే లభ్యముకాగలడు. (8:22)

యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు. (8:28)

తొమ్మిదవ అధ్యాయం : రాజవిద్యారాజగుహ్యయోగః

ఈ బ్రహ్మజ్ఞానము విద్యలకు తలమానికము. సమస్త గోప్యవిషయములకును శిరోభూషనము. అతి పవిత్రము. ఉత్తమోత్తమము. ప్రత్యక్షఫలదాయకము. ధర్మయుక్తము, సాధన చేయుటకు మిక్కిలి సులువైనది. (9:2)
ఓ పరంపతా! ఈ ధర్మమార్గమునందు విశ్వాసములేని పురుషులు నన్ను పొందజాలరు. కనుక వారు మృత్యురూప సంసారచక్రమునందు మళ్ళి మళ్ళి పడుచున్నారు. (9:౩)
నిరాకారపరబ్రహ్మమైన నాచేతనే ఈ జగత్తంతయును వ్యాపించబడియున్నది. ప్రాణులన్నియు నాయందే యున్నవి. కాని వాస్తవముగా నేను వాటియందు లేను. (9:4)
ఆకాశమునుండి ఉత్పన్నమై, సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా ఆకశామునందే స్తితమై యుండును. అట్లే నా సంకల్పము ద్వారా భూతములు (ప్రాణులు) అన్నియును నా యందే ఉన్నవని గ్రహించుము. (9:6)
ఓ కౌంతేయా! కల్పాంతము(ప్రళయకాలము) నందు భూతములన్నియును నా ప్రకృతినే చేరును. మరల సృష్టి ఆరంభమున(కల్పాదియందు) సకల ప్రాణులను నేను సృజించుచుందును. తమతమ స్వభావవశమున పరతంత్రమైయున్న భూత సముదాయమును నా ప్రక్రుతినాశ్రయించి మాటిమాటికి వాటి కర్మానుసారము మరలమరల పుట్టించుచున్నాను. (9:7,8)
ఓ అర్జునా! ఆ సృష్ట్యాది కర్మలయందు సంగములేక  ఉదాసీనునివలెనున్న నన్ను ఆ కర్మలు బందింపవు. (9:9)     
ఓ అర్జునా! సాక్షిభూతుడైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. ఈ కారణము వలననే జగత్తు పరిభ్రమించుచున్నది. (9:10)
నా పరమభావమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకును మహేశ్వరుడను (ప్రభువును) ఐన నన్ను లోకకల్యాణమునకై అవతారములను ఎత్తిన కారణమున సామాన్య మానవునిగా భావించి, నన్ను అలక్ష్యము చేయుచున్నారు. (9:11)  
వ్యర్ధములైన ఆశలచే, కర్మలచే నిక్షిప్తములైన మనస్సుగల అజ్ఞానులు రాక్షసీ ఆసురీ మోహినీ స్వభావములను పొందుచున్నారు. (9:12)
కానీ ఓ పార్థా! దైవీప్రకృతిని ఆశ్రయించిన మహాత్ములైతే నన్ను సకల ప్రాణులకూ మూలకారణముగను, అవ్యయునిగాను (అక్షరరూపునిగను) తెలిసికొని, నిశ్చలమనస్కులై నిరంతరము నన్నే భజించుచున్నారు.   (9:13)
ఆ దృఢవ్రతులైన భక్తులు నా నామగుణములను నిరంతరము కీర్తింతురు. నన్ను చేరుటకు యత్నించురు. పదేపదే నాకు ప్రణమిల్లుదురు. సర్వదా నా ధ్యానమునందే నిమగ్నులయ్యెదరు. అనన్య భక్తితో నన్ను సేవించుచున్నారు. (9:14)
మరికొందరు జ్ఞానులు నిర్గుణనిరాకార బ్రహ్మమైన నన్ను జ్ఞానయజ్ఞము ద్వారా అభేధభావముతో ఉపాసించుచుందురు. మరికొందరు అనంత రూపములతో ఒప్పెడి నా విరాట్ స్వరూపమును ద్వైత భావముతో పూజించుచున్నారు. (9:15)
ఈ సమస్త జగత్తునకు ధాతను అనగా ధరించువాడను, అట్లే కర్మలఫలములను ఇచ్చువాడను నేనే. తల్లియును, తండ్రియును, తాతయును నేనే. తెలిసికొనదగిన వాడను నేనే. పవిత్రుడను, ఓంకారమును నేనే. ఋక్సామ యజుర్వేదములను నేనే. (9:17)
పరమగతియైన పరమధామమును, జగత్తును భరించి, పోషించువాడను నేనే, అందరికిని నివాసస్థానమును, శరణుపొందదగినవాడను నేనే. ప్రత్యుపకారమును అసింపక హితమొనర్చువాడను, అందరి ఉత్పత్తిప్రళయములకు హేతువును, వారి స్తితికి ఆధారమును, నిధానమును, అవ్యయ బీజమును నేనే. (9:18)
ఓ అర్జునా! సూర్యరూపమున నేనే తలపించుచున్నాను. సముద్రముల నుండి నీటిని గ్రహించి వర్షరూపమున మరల వదలెను. అమృతమును, మృత్యువును గూడ నేనే. సత్తును (శాశ్వతమైన ఆత్మను) అసత్తును (నశ్వరమైన సమస్త వస్తుజాలము (జగత్తును)) గూడ నేనే.  (9:19)
సకామకర్మలు చేయువారు, సోమరసపానము చేయువారును, పాపరహితులై యజ్ఞములద్వార నన్ను సేవించి, స్వర్గ ప్రాప్తిని కోరుచుందురు.అట్టివారు స్వర్గమునకు పోయి స్వర్గ సుఖములను అనుభవించి, ఆ పుణ్యములు అయిపోగానే మరల ఈ మర్త్యలోకమున జనింతురు.అనగా పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. క్షీనింపగానే తిరిగి మానవలోకమున జన్మించెదరు. (9:20,21)
పరమాత్మస్వరూపుడును(నిరాకారుడైన) అయిన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతన చేయుచు, నిష్కామ భావముతో కర్మలను చేయుచు (అంటే కర్మఫలాన్ని భగవదర్పితం చేయుచు) సేవించువారి యోగక్షేమములను నేనే వహించుచుందును. (9:22)
ఓ అర్జునా! శ్రద్దాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పుజించినట్లే. కానీ వారిపూజలు అవిది పూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో మరియు అవిద్యతో కూడినవి. ఏలనన సకల యజ్ఞములకు భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్వమును ఎరుంగరు. కావున వారు అందరు పతనమగుచున్నారు (పునర్జన్మ పొందుచున్నారు) (9:23,24)
దేవతలను పూజించువారు దేవలోకమును చేరుదురు. పితరులను సేవించువారు పిత్రులోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను నిరాకారముగా ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. (9:25)
ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. (9:26)
ఓ కౌంతేయ ! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించుదానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పించుము. ఈ విధముగా సన్యాసయోగమునందు స్తిరచిత్తుడవై, అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూపకర్మ బంధములనుండి ముక్తుడవయ్యెదవు. పిదప నా పరమపదమునే (అంటే నన్నే) పొందగలవు. (9:27,28)
నేను సకలభభూతముల(ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కానీ నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనునే వారియందు ఉందును. (9:29)
మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యదార్థముగా అతడు నిశ్చయబుద్ది గలవాడు. అనగా అతడు సాదువేయని గ్రహింపుము. (9:౩౦)
కౌంతేయా ! అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగును . శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడేన్నడును నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరుంగుము. (9:31)
ఈ మానవ శరీరము క్షణబంగురము. సుఖరహితము, ఐనను దుర్లభము. కనుక దీనిని పొంది నిరంతరము నన్నే భజించి ముక్తుడవగుము. (9:౩౩)

పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు. (9:34)

పదవ అధ్యాయం : విభూతి యోగః

పదవ అధ్యాయం విభూతి యోగః లో, భగవానుడు నేనే ఈ సమస్త జగత్తు అంతను అయి ఉన్నను.అంటే మన కంటికి కనిపించే ఈ మొత్తం చరాచర (ప్రకృతి అంతయు) జగత్తు అంతయు నేనే అయి ఉన్నను.ఈ జగత్తు అంతయు యోగ మాయచే నిర్మితమైనది, నేను కాకుండా అంటూ ఈ కనించే ప్రకృతిలో ఏదియును లేదు అదేవిధంగా కనిపించని ఆ స్వస్వరూపమైన , నిరాకారమైన, శాస్వతమైన్, సత్యమైన, నిత్యమైన, పురాతనమైన, అందరి హృదయాలలో వున్న ఆ చిదానంద స్వరూపుడనైన ఆ ఆత్మ ను కూడ నేనే అని వివరించినాడు.
నా ఉత్పత్తిని అనగా నా లీలావతార విశేషములను దేవతలు గాని, మహర్షులుగాని తెలిసికొనజాలరు. ఏలనన నేను అన్నివిధములుగా ఆ దేవతలకును, ఈ మహర్షులకును ములకారణమైనవాడను నేనేగదా! (10:2)
నన్ను యదార్థముగా జన్మరహితునిగను, అనాదియైన వానినిగాను సకలలోక మహేశ్వరునిగను తెలిసికొనువాడు మానవులలో జ్ఞానీ, అట్టివాడు సర్వపాపములనుండియు విడివడుచున్నాడు. (10:౩)
నిశ్చయాత్మకశక్తి, యదార్థజ్ఞానము, మొహరాహిత్యము, క్షమ, సత్యము ,దమము, శమము, సుఖదుఃఖములు, ఉత్పత్తి ప్రళయములు, భయము, అభయము, అహింస, సమత, సంతోషము, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి అనునవి ప్రాణులకు నావలననే కలుగుచున్నవి. (10:4,5)
కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించును. (10:6)
ఈ సమస్తజగత్తుయొక్క ఉత్పత్తికి నేనే మూలకారణము. నావలననే ఈ జగత్తంతయు నడుచుచున్నది. ఈ విషయము బాగుగా ఎరింగిన జ్ఞానులైన భక్తులు భక్తీశ్రద్దలతో నిరంతరము నన్నే సేవించుచున్నారు. (10:8)
నా భక్తులు నా యందే తమ మనస్సులను లగ్నమొనర్తురు .తమ ప్రాణములను, తమ కర్మలన్నింటిని, తమ సర్వస్వమును నాకే అంకిత మొనర్తురు. నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందము ననుభవించుచున్నారు . నిరంతరము సంతుష్టులగు చుందురు. (10:9)
అట్లు నిరంతరము ధ్యానాదులద్వార నాయందే లగ్నమనస్కులై భక్తిశ్రద్దలతో నన్నే భజించువారికి నేను బుద్దియోగమును అనగా తత్త్వయోగమును అనుగ్రహించుచున్నాను. (10:10)
ఓ అర్జునా! వారి అంతః కరణములయందు స్తితుడనై యున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్త్వజ్ఞానరూప దీపమును (జ్యోతిని) వెలిగించి వీరి అజ్ఞానందకారమును పోగొట్టుచున్నాను. (10:11)
అర్జును పలికెను నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమపవిత్రుడవు. నిన్ను సనాతనుడవనియు, దివ్యపురుషుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపివనియు ప్రస్తుతింతురు. (10:12)
ఓ కేశవా! నీవు చెప్పునది అంతయు సత్యమే .హి భగవాన్ ! నీ లీలామయస్వరూపమును దేవతలు గాని దానవులు గాని తెలియలేరు. (10:14)
ఓ జగదుత్పత్తికారకా! ఓ సర్వభూతేషు! ఓ దేవాదిదేవా! ఓ జగన్నాథా! ఓ పురుషోత్తమా! నీ తత్త్వమును నీవే ఎరుగుదవు. (10:15)
ఓ యోగీస్వరా! నిరంతరము చింతన చేయుచు నిన్ను ఏవిధముగా తెలిసికోనగలను? హే భగవాన్? ఏ యే భావములతో నాద్వార చింతన చేయదగినవాడను ? నిన్ను నేను ఎట్లు ధ్యానింపవలెను. (10:17)
సమస్తభూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను.
ఓ అర్జునా! సమస్త ప్రాణుల హృదయములందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. సకల భూతముల ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను (ఆదియు,మధ్యస్థితియు అంతము నేనే). (10:20)
అదితియొక్క ద్వాదశపుత్రులైన ఆదిత్యులలో విష్ణువును నేను. జ్యోతిర్మయ స్వరూపులలో సూర్యుడను నేను. 49 మంది వాయుదేవతలలోని తేజమును నేను. తారలయందు చంద్రుడను నేను. (10:21)
వేదములలో నేను సామవేదమును, దేవతలలో ఇంద్రుడను నేన్. ఇంద్రియములలో మనస్సును నేనే. ప్రాణులలో చైతన్యమును నేనై యున్నాను. ఏకాదశరుద్రులలో శంకరుడను నేను .యక్షరాక్షసులలో ధనాదిపతియైన కుబేరుడను నేను. అష్టవసువులలో అగ్నిని నేను. పర్వతములలో సుమేరు పర్వతమునై యున్నాను (10:22,23)
రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. (10:౩౦)
ఓ అర్జునా! సృష్టికి ఆదిమద్యాంతములు నేను. విద్యలలో ఆధ్యాత్మవిద్యను అనగా బ్రహ్మవిద్యను నేను. వాదించు వారిలో నేను వాదమును. (10:32)
అన్ని ప్రాణములను హరించు మృత్యువును నేనే. సమస్త ప్రాణుల ఉత్పత్తి హేతువును గూడ నేనే . (10:34)    
లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు. (10:41)

ఓ అర్జునా! సర్వప్రాణుల ఉత్పత్తికి కారణమైన బీజమును నేనే. ఈ చరాచర భూత ప్రపంచమున నేను కానిది ఏదియును లేదు. ఈ సంపూర్ణ జగత్తును కేవలము నా యోగశక్తి ఒక్క అంశతోడనే నేను వ్యాపించియున్నాను.(10:42).

పదకొండవ అధ్యాయం : విశ్వరూప దర్శన యోగః

పదకొండవ అధ్యాయం విశ్వరూపదర్శన యోగః లో, భగవానుడు శ్రీ కృష్ణుడు , అర్జునుడికి తనే సమస్తము, తన నుంచే ఈ సమస్తము, ఈ సృష్టి స్తితిని, గతిని , కర్త, కర్మ, క్రియ అన్నిటికిని మూల కారణమూ, అన్నియు నాలోనే వున్నవి , అన్నియు నా నుండే ఉద్భవిస్తున్నవి మరియు తిరిగి నాలోనే విలీనమగుచున్నవి అంతయు నేనే అయి వున్నాను, అన్నియు నేనే అయి ఉన్నాను అని భగవానుడు తన విశ్వరూపాన్ని దర్శనమిచ్చాడు అర్జునునికి.
పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము. (11:5)
ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము. (11:15,16,20)
అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్దమునకు సిద్దపడినవారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిందెవ్వరును లేరు. (11:32)
ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. (11:34)
అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా... (11:46)

అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు. (11:52)