Thursday, March 20, 2014

దేవున్ని చేరేందుకు మార్గాలు :


దేవున్ని చేరేందుకు మార్గాలు : దేవుణ్ణి చేరేందుకు అంటే దేవునిలో (పరమాత్మలో) ఐక్యమయ్యేందుకు భగవద్గీతలో శ్రీ కృష్ణుడు చెప్పిన మార్గాలు :

కర్మ యోగం : మొదట కర్మ అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం. కర్మ అంటే మనం చేసే ప్రతి పని ఒక కర్మే. ఈ కర్మలు మనం ఎందుకు చేయాలి. ఇవి అన్నియు మనకు ఏమి సంబంధం? మనం ఎందుకు చేయవలసి వస్తుంది? అంటే మనం ఎన్నో జన్మలనుండి అజ్ఞానంతో మరియు అవిద్యతో నేను అనే భావనతో ఏర్పరచుకున్న కర్మ బంధనాలు. వీటిని అన్నిటిని జ్ఞానంతో చేస్తే మనము వీటి నుండి సంపూర్ణంగా విముక్తి పొందుతాము. మనం చేసే ప్రతి పనిని ఈ శరీర భావనతో అజ్ఞానంలో వున్నప్పుడు చేస్తూ నేను చేస్తున్నాను అనుకుంటూ వుంటాము. ఆ విధంగా చేయడం వలన మనం మరల కర్మ బంధనాలను ప్రోగు చేసుకుంటున్నాము. కావున ఇక్కడ మనం గ్రహించవలసిన జ్ఞానం ఏమిటంటే నీవు అన్నది ఎవరు? అని ఆలోచిస్తే నీవు అన్నది ఆత్మ మాత్రమే, నీవు అన్నది ఈ శరీరము, మనస్సు, బుద్ధి ఏవి కావు. మరి ఆత్మ ఎప్పటికి ఏమి చేయదు అది అంతరంలో సాక్షి భూతంగా మాత్రం వుంటుంది తప్ప అది అంటూ ఏమి చేయదు. కావున దీనిని గ్రహించి చేసే ప్రతి పనిని నీవు భగవంతార్పణ బుద్దితో, ఫలాపేక్ష రహితుడవై, నిష్కల్మషంగా కర్మలను ఆచరించి వీటి అన్నిటి నుండి నీవు సంపూర్ణంగా విముక్తిని పొందడమే ముక్తి” .ముక్తి అంటే పరమాత్మ సాగరంలో ఆత్మ ఐక్యం కావడం.ముక్తి పొందడం అంటే నీవు మరల ఈ కర్మ భూమికి రాకుండా (అంటే జన్మ లేకుండా) ఆ దేవదేవుడైన పరంధాముని లో విలీనం అవడం. ఈ విధంగా జ్ఞానంతో కర్మలను ఆచరించడాన్నే కర్మయోగంఅంటారు. ఈ విధంగా కర్మయోగాన్ని అవలంబించి అగామికర్మలను కర్మయోగం ద్వార చేసి బంధాలు కాకుండా చూసుకోవాలి.(అంటే అజ్ఞానంలో నేను (ఈ శరీరం) అన్న ఆహంకారంతో తెలియక ఏర్పరచుకున్న ప్రారబ్ధ కర్మలను, ఇప్పుడు మనం చేస్తున్న ఈ ఆగామి కర్మల ద్వారా వాటిని అన్నిటిని నిష్కామంగా మరియు భగవంతార్పణ బుద్దితో చేస్తూ నిర్ములించుకోవాలె తప్ప మరల వాటిని ప్రోగు (అంటే సంచితం) చేసుకొని వాటికి బద్దులం కాకూడదు. ఈ విధంగా మనం కర్మయోగాన్ని మన నిత్య జీవితంలో అమలుపరచుకోవాలి).

జ్ఞాన యోగం: అసలు జ్ఞానం అంటే ఏమిటి ? జ్ఞానం అంటే భగవంతుని గురించి సంపూర్ణంగా పరిపూర్ణంగా అయన స్వస్వరుపాన్ని మరియు నీవు అంటే ఎవరు అన్న విషయాలను కూలంకషంగా గ్రహించడమే జ్ఞానం. దీనికి అన్యమైనది ఏదైనా అజ్ఞానమే. భగవంతుని స్వస్వరూపం అంటే ఏముంది దేవుడు అంటే అయన ఎదో ఒక రూపంలో వుంటాడు అయన పైన వుండి మనం అడిగినవన్నీ తీరుస్తాడు అనుకోవడం కూడ అజ్ఞానమే. మొదట తెలుసుకోవలసింది ఏమిటంటే నీవు ఏది కోరితే అది ఇస్తాడు. అది తీరుతుంది కాని దేవునికి రూపం అనడమే అజ్ఞానం.దేవుడైన పరమాత్ముడు నిరాకారుడు, నిర్గుణుడు, సత్యుడు, శాస్వితుడు, అమరుడు, పుట్టుకలు లేనివాడు, నిత్యుడు, పురాతనుడు అయిన ఎల్లప్పుడూ నూతనుడు, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడు ఆయన ఈ సమస్తం వ్యాపించి ఉంటాడు. మరియు ఈ ప్రక్రుతి అంతయు కూడ ఆయనే అయి ఉన్నాడు.అది ఆ దేవదేవుడైన పరమాత్మా యొక్క స్వస్వరూపం.మరి నీవు ఎవరు ? అనగానే నేను అంటే ఈ శరీరం అనే భావన మనకు వస్తుంది. కాని ఈ శరీరం ఇప్పటికి కాకపోయిన ఎదో ఒక రోజు నశిస్తుంది కదా! అప్పుడు నీ పరిస్తితి ఏంటి. దానిని తెలుసుకోవడమే జ్ఞానం. నీవు అంటే ఈ మాంసపు ముద్దలతో ఉన్న ఈ శరీరము కాదు. మరి ఎవరు పోనీ నేను అంటే ఈ మనస్సా, బుద్ధా లేక ప్రాణమా! ఇవి ఏవియు నీవు కాదు వీటికి అన్నిటికి అతీతంగా వుంటూ వీటికి అన్నిటికి శక్తినిచ్చే ఒక సాక్షిభూతమైన ఆత్మ స్వరూపుడివి మాత్రమే నీవు అన్నది తెలుసుకోవడమే జ్ఞానం.ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని సంపూర్ణంగా గ్రహించి దానిని నీ నిత్య జీవితంలో అమలుపరచుకొని ఆ పరమాత్మునిని స్మరించడమే జ్ఞానయోగం. ఈ జ్ఞానయోగం గ్రహించి నీ మనస్సులో నిర్మలంగా తెలుసుకుంటూ అవలంబిస్తే నీవు అంటే ఆత్మ స్వరూపుడవైన నీవు ఆ పరంధామునిలో ఐక్యం అవుతావు. ఈ విధంగా ఆత్మానాత్మ వివేకాన్ని గ్రహించి తెలుసుకోవడం మరియు తెలుసుకున్న దానిని అమలుపరచే దానినే జ్ఞానయోగం అంటారు. ఈ విధంగా జ్ఞాన యోగాన్ని అవలంబించి మనం తెలియక అజ్ఞానంలో నేను అన్న అహంకారంతో ఏర్పరచుకున్న సంచిత కర్మలన్నిటిని ఒక్కసారిగా దగ్దం చేయాలి ? ఎక్కడ ? జ్ఞానాగ్నిలో, “జ్ఞానాగ్ని దగ్ద కర్మాణాంఅని గీతలో శ్రీ కృష్ణుడు చెప్పాడు. కనుక జ్ఞానమనే అగ్నిలో సర్వకర్మలు దగ్దం చేయుట ఒక్కటే మార్గం.ఈ ఉపాయాన్నే జ్ఞానయోగం అన్నారు.

భక్తి యోగం : భక్తి అంటే భగవంతునిని మనస్సులో నిరంతరం స్మరించడమే భక్తి. కాని మనం ఎదో ఎప్పుడైనా కస్టాలు వచ్చినపుడు లేకపోతె ఏదైనా భయం అయినపుడు మాత్రం స్వామి ఆంజనేయ అనో లేక మరో వేరే దేవున్నో తలచుకోవం మనకు పరిపాటి. కాని ఇలా కాదు భక్తీ అంటే సంపూర్ణంగా, పరిపూర్ణంగా నీ మనస్సును ఆ పర్మమత్ముని యందే లగ్నం చేయడం. అప్పుడు అందరికి ఒక సందేహం అదేంటి ఎప్పుడు అయన యందే మనస్సును లగ్నం చేస్తే నేను చేయవలసిన పనులు ఎవరు చేస్తారు అనే సందేహం కదా.నీవు చేసే ఏ పనైనా సరే అది ఆయనే చేస్తున్నాడు అని భావించు ఎందుకంటే ఈ ప్రక్రుతి అంతా తానే అయి ఉన్నాడు ఆ విధంగా భావిస్తూ నీ మనస్సు అంతఃకరణాన్ని సుద్దపరచు. ఆ విధంగా నీవు నిరంతర స్మరణతో భక్తితో అన్ని పనులను ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఈ విధంగా చేయడం వలన నీ మనస్సుకు ఒక సంపూర్ణత భావం ఏర్పడి అది పరిశుద్దమవుతుంది. ఈ విధంగా ఎల్లవేళలా ఆయనను స్మరిస్తూ వుండడం వలన నీవు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు ఆయననే పొందుతావు ఆయనలోనే విలీనం అవుతావు. అదియే మోక్షం. ఈ విధంగా మనం తెలియక ఏర్పరచుకున్న మరియు ఖచ్చితంగా వదిలించుకోవలసిన ఈ ప్రారబ్ధ కర్మ ఫలాలను భగవత్ స్మరణతో భక్తి యోగం ద్వార అనుభవించి ఖర్చుచేసుకోవాలి.

ధ్యాన యోగం : ధ్యాన యోగం అన్ని యోగాలకంటే చాల చాల ఉన్నతమైనది ఎందుకంటే శరీరముతో వున్నపుడు ఈ శరీరపు అంతరములో వున్న ఆ పరమాత్మునిని, ఆ దేవదేవుడిని పరిపూర్ణంగా దర్శించే భాగ్యం ఈ ఒక్క ధ్యాన యోగంలో మాత్రమే సాధ్యమవుతుంది. ధ్యానం అంటే సాధన. సాధన అంటే ప్రతి రోజు ధ్యానం చేసుకోవడం. చాల మందికి అమ్మో ధ్యానం అంటే ఇది చాల కష్టం అని అనుకుంటారు ఎందుకంటే కూర్చుంటే చాలు అంతవరకూ లేని ఆలోచనలు కూడ వెన్ను తట్టి నిద్ర లేచినట్లుగా ఒక్కొక్కటి మన మనస్సులో వస్తూనే ఉంటాయి. కాబట్టి ఇది సాధ్యం కాదులే వేరే యోగం అవలంబిస్తాం అనుకుంటారు. కాని అన్నిటికన్నా ధ్యానయోగం మాత్రం చాల శక్తివంతమైనది. ఇది అవలంబించిన వాళ్ళు అంతా మహానుభావులు అయ్యారు. ఎవరైనా సరే ఈ యోగాన్ని ప్రారంబిస్తే చాలు, నిదానంగా తన మనస్సు, బుద్ధి అన్నియు అతని అధీనంలోకి ఖచ్చితంగా వస్తాయి. కాని కొద్దిగా సమయం పడుతుంది.అయితే ప్రతిరోజూ ఖచ్చితంగా అవలంబిస్తే అవి తొందరగా అన్నియు అధీనంలోకి వచ్చి సమాధి స్తితి లోకి వెళ్ళవచ్చు. సమాధి స్తితికి వెళ్తే నీ మనస్సు దాదాపు నీ అధీనంలో వుంటుంది.మనస్సును ఎలా అదుపు చేయాలి ధ్యానంలో? ఇది అందరి మనస్సులో మెదిలే మొదటి ప్రశ్న.అవును నిజమే ఈ మనస్సు అంటే సముద్రంలో అలలమాదిరి, అయిన అటువంటి మనస్సును అదుపు చేయొచ్చు. ఎలా అంటే మొదట నీ మనస్సుకు ఒకే ఒకటి చెప్పు అదే, ఈ సమస్త లోకానికి కారణభూతుడైన ఆ దేవదేవుని దర్శనార్థం, ఆ భగవంతుని దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించడం కోసం, ఈ సృష్టికి కారణమైన ఆ దేవదేవుడు ఈ శరీరంలోనే అంతరంలో ఉన్నాడు అది జ్యోతిర్లింగస్వరుపుడు అని దానికి చెప్పి నీ శరీరపు హృదయ స్పందన మీదకు నీ మనస్సును మరలుస్తూ అదే విదంగా ఒక దివ్య జ్యోతిని మాత్రమే నీ మనస్సులో ఊహించుకొని ప్రతి దినము చేస్తూ వుంటే నిదానంగా నీ మనస్సు నీ చెప్పు చేతల్లోకి వస్తుంది.ఈ విధంగా జ్ఞాన మరియు వైరాగ్యాలతో నీ మనస్సును నీ అధీనంలోకి తెచ్చుకోవచ్చు. ఆ విధంగా అవలంబించడాన్నే ధ్యాన యోగం అంటారు. ఎందఱో మహానుభావులు ఈ ధ్యాన యోగం ద్వార ఈ సమాజానికి జ్ఞాన బోధ చేశారు. ఏస్తుక్రీస్తు, బుద్దుడు, వివేకానంద స్వామి, రామక్రిష్ణ పరమహంస, రమణ మహర్షి ఇలా ఎందఱో ఎందెందరో అలా వారి స్తాయికి చేరే సంపూర్ణ అవకాశాలు నీకు వున్నాయి. కావున ఈ రోజే ప్రారంబించు . శాశ్వతమైన పరిశుద్దమైన ఆ పరమాత్మను నీ అంతరంలో దర్శించుకొని శరీరం ఉండగానే ముక్తుడవై నీ జన్మకు సార్ధకతను మరియు నీ జన్మ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చు.

ఓం నమో పరమాత్మయే నమః

Wednesday, February 12, 2014

భగవద్గీత (ఘంటశాల) :

పద్మశ్రీ ఘంటశాల గారు ఆలపించిన భగవద్గీత :
1. భగవద్గీత మహాభారతము యొక్క సమగ్ర సారాంశము, భక్తుడైన అర్జునకు ఒనర్చిన ఉపదేశమే గీతా సారాంశము. భారతయుద్దము జరుగరాదని సర్వవిధముల భగవానుడు ప్రయత్నించెను. కానీ, ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్ధములాయెను. అటుపిమ్మట శ్రీకృష్ణుడు పార్దునకు సారధియై నిలిచెను.
యుద్దరంగమున అర్జునుని కోరిక మేరకు రధమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి.
2. స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయాము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్భాణములను క్రింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మా... (1:32)
౩. దుఃఖింప తగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు, అనిత్యములైన శరీరములను గూర్చిగాని, నిత్యములు, శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చిగాని దుఃఖింపరు. (2:11)
4. జీవునకు దేహమునందు బాల్యము, యౌవనము, ముసలితనము యెట్లో మరొక దేహమును పొందుటకు కూడ అట్లే కనుక ఈ విషయమున ధీరులు మోహము నొందరు. (2:13)
5. మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రములను వదలి నూతన వస్త్రములను ధరించునో అట్లే ఆత్మ(జీవాత్మ) జీర్ణమైన శరీరమును వదలి క్రొత్త శరీరమును ధరించుచున్నది. (2:22)
6. ఆత్మ నాశనము లేనిది, ఆత్మను శస్త్రములు చేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఆత్మ నాశనము లేనిది. (2:23)
7. పుట్టినవానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. (2:27)
8. యుద్దమున మరణించినచో వీరస్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యమును భోగింతువు. కావున అర్జునా! యుద్దమును చేయు కృతనిశ్చయుడవై లెమ్ము. (2:37)
9.కర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. (2:47)
10.దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పోయిన వాడును, స్థితప్రజ్ఞుడని చెప్పబడును. (2:56)
11.విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును. (2:62) 
12. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. (2:72)
13. అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్దిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది. (౩:౩)
14. అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును. (౩:14)   
15. పార్దా! నాచే నడుపబడు ఈ లోకము అను చక్రమును బట్టి, యెవడు అనుసరింపడో, వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు, జ్ఞానీ కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను. (౩:16)
16. ఉత్తములైన వారు దేని నాచరింతురో, దానినే ఇతరులును ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును. (౩:21)
17. అర్జునా! నీ వొనర్చు సమస్త కర్మలనూ నా యందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై, అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్దము చేయుము. (౩:౩౦)
18. చక్కగా అనుస్టింపబడిన పరధర్మము కన్న, గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి ధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. పరధర్మము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది. (౩:35)
19. పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యున్నది. (౩:38)
20. ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్దినొందునో, ఆయా సమయములయందు శిష్టరక్షణ, దుష్టశిక్షణ, ధర్మ సంరక్షణముల కొఱకు ప్రతీయుగమునా అవతారము దాల్చుచున్నాను. (4:7,8)
21. అనురాగము, భయము, క్రోధము వదలి నా యందు మనస్సు లగ్నము చేసి, ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరి. (4:10)
22. ఎవరెవరు యేయే విధముగా నన్ను తెలియకోరుచున్నారో వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కానీ, ఏ ఒక్కనియందు అనురాగాముకాని, ద్వేషముగాని లేవు. (4:11)
23. ఎవని కర్మాచరణములు కామ సంకల్పములు కావో యెవని కర్మలు జ్ఞానమను నిప్పుచే కాల్పబడినవో, అట్టివానిని పండితులని విద్వాంసులని పల్కుదురు. (4:19)
24. యగ్నపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము గూడ బ్రహ్మమనియే తలంచవలయును. (4:24)
25. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్ధుడగును. అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును. (4:39)
26. కర్మ, సన్యాసములు రెండునూ మోక్షసోపాన సాధనములు. అందు కర్మ పరిత్యాగము కన్నా, కర్మానుష్టానమే శ్రేష్ఠమైనది. (5:2)
27. ఎవడు ఫలాపేక్ష కాంక్షింపక బ్రహ్మార్పనముగా కర్మల నాచరించునో, అతడు తామరాకుకు నీటిబిందువులు అంటని రీతిగా పాపమున చిక్కుబడడు. (5:10)
28. ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడునో అతనికి జ్ఞానము సూర్యునివలె ప్రకాశించి పరమార్థతత్వమును జూపును. (5:16)
29. విద్యా వినయ సంపన్నుడగు బ్రాహ్మణునియందును శునకము శునక మాంసము వొండుకొని తినువాని యందును పండితులు సమదృష్టి కలిగి వుందురు. (5:18)
౩౦. దేహత్యాగమునకు ముందు యెవడు కామక్రోధాది అరిషడ్వర్గములను జయించునో, అట్టివాడు యోగి అనబడును. (5:23)
31. ఎవడు ఇంద్రియములను జయించి, దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంబిమపజేసి, మనస్సును, బుద్దిని, స్వాధీన మొనర్చుకొని, మోక్షాసక్తుడై యుండునో అట్టివాడే ముక్తుడనబడును. (5:28)
32. సకల యజ్ఞ తపః ఫలములను పొందువానిగను, సకల ప్రపంచ నియామకునిగను, నన్ను గ్రహించిన మహనీయుడు మోక్షమును పొందుచున్నాడు. (5:29)
౩౩. అర్జునా! సన్యాసమని దేనినందురో, దానినే కర్మయోగ మనియు అందురు. అట్టి యెడ సంకల్పత్యాగమొనర్పనివాడు యోగికాజాలడు. (6:2)
౩4. యుక్తాహార విహారాదులు, కర్మాచరణము గలవానికి ఆత్మసంయమ యోగము లభ్యము. (6:17)
35. గాలిలేనిచోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగుననే మనోనిగ్రహము కలిగి అత్మయోగమభ్యసించిన వాని చిత్తము నిశ్చలముగా నుండును. (6:19)
౩6. సకలభూతములయందూ సమదృష్టి కలిగినవాడు, అన్ని భూతములు తనయందును, తనను అన్ని భూతములయందును చూచుచుండును. (6:29)
37. అర్జునా! ఎట్టివానికైనను, మనస్సును నిశ్చలముగా నిల్చుట దుస్సాధ్యమే. అయినను దానిని అభ్యాసవైరాగ్యములచేత నిరోధింపవచ్చును. (6:35)
38. అర్జునా! పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నాశ్రయించి వినయముతో ఎవరు సేవించి, భజింతురో వారు సమస్త యోగులలో ఉత్తములు. (6:47)
39. వేలకొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞానసిద్ది కొరకు ప్రయత్నించును. అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమె నన్ను యదార్ధముగా తెలుసుకోన గలుగుచున్నాడు. (7:౩)
40. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా మాయాశక్తి యెనిమిది విధములైన భేదములతో ఒప్పియున్నదని గ్రహింపుము. (7:4)
41. అర్జునా! నా కన్నా గొప్పవాడుగాని, గొప్పవస్తువుగాని, మరేదియును ఈ ప్రపంచమున లేదు. సూత్రమున మణులు గ్రుచ్చబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమై ఉన్నది. (7:7)
42. భూమియందు సుగంధము, అగ్నియందు తేజము, యెళ్ళ భూతముల యందు ఆయువు, తపస్సుల యందు తపస్సు నేనుగా ఎరుగుము. (7:9)
43. పార్దా! త్రిగునాత్మకము, దైవసంబందమగు నా మాయ అతిక్రమింపరానిది. కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభసాధ్యము. (7:14)
44. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధకాములు, జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్నాశ్రయించుచున్నారు. (7:16)
45. జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞానియై నన్ను శరణమునొందుచున్నాడు. (7:19)
46. ఎవడు అంత్య కాలమున నన్ను స్మరించుచు శరీరమును వదలుచున్నాడో, వాడు నన్నే చెందుచున్నాడు. (8:5)
47. అర్జునా! ఎవడు అభ్యాసయోగముతో, ఏకాగ్రచిత్తమున దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించునో, అట్టివాడు ఆ పరమపురుషునే చెందుచున్నాడు. ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు, పురాణపురుషుడు, ప్రపంచమునకు శిక్షకుడు, అణువుకన్నా అణువు, అనూహ్యమైన రూపము కలవాడు, సూర్యకాంతి తేజోమయుడు, అజ్ఞానాంధకారమున కన్నా ఇతరుడు. (8:8,9)
48. ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మపదము శాశ్వతమైనది. పునర్జన్మ రహితమైన ఆ ఉత్తమపదమే పరమపదము. (8:21)
49. జగత్తునందు శుక్ల,కృష్ణములనెడి రెండు మార్గములు నిత్యములుగా నున్నవి. అందు మొదటి మార్గము వలన జన్మ రాహిత్యము, రెండవదాని వలన పునర్జన్మము కలుగుచున్నవి. (8:26)
5౦. యోగియైనవాడు వేదాధ్యయనము వలన, యగ్నతపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమమైన బ్రహ్మ పదవిని పొందగలడు. (8:28)
51. పార్దా! ప్రళయకాలమునందు సకల ప్రాణులును, నాయందు లీనమగుచున్నవి, మరల కల్పాదియందు సకల ప్రాణులను నేనే సృష్టించుచున్నాను. (9:7)
52. ఏ మానవుడు సర్వకాల సర్వావస్థలయందును నన్నే ధ్యానించుచుండునో, అట్టివాని యోగక్షేమములు నేనే వహించుచున్నాను. (9:22)
53. ఎవడు భక్తితో నాకు పత్రమైనాను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుచున్నాడో, అట్టి వానిని నేను ప్రీతితో స్వీకరించుచున్నాను. (9:26)
54. పార్దా! నాయందు మనస్సు లగ్నముచేసి యెల్లకాలము యందు భక్తీ శ్రద్దలతో స్థిరచిత్తుడవై పుజించితినేని నన్నే పొందగలవు. (9:34)
55. కశ్యాపాది మహర్షి సప్తకము, సనకసనందనాదులు, స్వయంభూవాది మనువులు నావలననే జన్మించిరి. పిమ్మట వారివలన ఎల్లలోకమందలి సమస్త భూతములు జన్మించును. (10:6)
56. పండితులు నాయందు చిత్తముగలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావ మెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకొనుచు బ్రహ్మానందము ననుభవించుచున్నారు. (10:9)
57. సమస్తభూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి, పెంపు నాశములకు నేనే కారకుడను. (10:20)
58. వేదములలో సామవేదము, దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందరి బుద్ధి నేనే. (10:22)
59. రాక్షసులలో ప్రహ్లాదుడు, గణికులలో కాలము, మృగములలో సింహము, పక్షులలో గరుత్మంతుడు నేనే. (10:౩౦)
6౦. లోకమునందు ఐశ్వర్యయుక్తమై, పరాక్రమయుక్తమై, కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజోభాగము వలననే సంభవములు. (10:41)
61. పార్దా! దివ్యములై, నానావిధములై, అనేక వర్ణములై, అనేక విశేషములు గల నా స్వస్వరూపమును కనులార దర్శింపుము. (11:5)
62. ప్రభో కృష్ణా! దేవా! ఎల్లదేవతలు, ఎల్లప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకీ మొదలగుగాగల యెల్ల సర్పములు నీయందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వరా! నీ విశ్వరూపము అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో ఒప్పియున్నది. అట్లయ్యుయు నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై, ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుటవలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో! నా యందు దయముంచి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణా! ప్రసన్నుడవు కమ్ము. (11:15,16,20)
6౩. అర్జునా! ఈ ప్రపంచమునెల్ల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్దమునకు సిద్దపడినవారిని నీవు చంపకున్నను బ్రతుకగల వారిందెవ్వరును లేరు. (11:32)
64. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రధ కర్ణాది యోధ వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. (11:34)
65. అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి, కిరీటము, గద, చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింప గోరుచున్నాను కృష్ణా... (11:46)
66. అర్జునా! నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరునూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరునూ సదా కోరుచుందురు. (11:52)
67. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి, శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు. వారే ఉత్తమ పురుషులు. (12:2)
68. అభ్యాసయోగము కన్న జ్ఞానము, జ్ఞానము కన్న ధ్యానము, దానికన్న కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి, మోక్షప్రాప్తి సంభవించుచున్నది. (12:12)
69. ఎవడు కోరికలు లేనివాడై, పవిత్రుడై, పక్షపాతరహితుడై, భయమును వీడి, కర్మఫలత్యాగియై నాకు భక్తుడగునో, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. (12:16)
7౦. శత్రుమిత్రులయందును, మానావమానములయందును, శీతోష్ణ సుఖ దుఃఖాదులయందును సమబుద్ది కలిగి సంగరహితుడై, నిత్యసంతుస్టుడై, చలించని మనస్సు గలవాడై, నా యందు భక్తిప్రవత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. (12:18,19)
71. అర్జునా! దేహము క్షేత్రమనియు, దేహము నెరిగినవాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. (13:1)
72. ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు ద్రుష్టి కలిగియుండుట జ్ఞానమార్గములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానము లనియు చెప్పబడును. (13:11)
7౩. ప్రకృతిని ‘మాయ’ యని యందురు. అది శరీర సుఖదుఃఖాదులను తెలియజేయును. క్షేత్రజ్ఞుడు, ఆ సుఖదుఃఖాదులను అనుభవించుచుండెను. (13:20)
74. శరీరము నశించినను, తాను నశింపక, ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో, వాడే యెరిగినవాడు. (13:27) 
75. అర్జునా! గుణనాశరహితుడైనవాడు పరమాత్మ, అట్టి పరమాత్మ దేహాంతర్గుడయ్యెను. కర్మలనాచారించువాడు కాడు. (13:31)
76. పార్దా! సుర్యుడోక్కడే యెల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింప జేయుచున్నాడో, ఆ విధముగానే క్షేత్రజ్ఞుడు యెళ్ళ దేహములను ప్రకాశింపజేయుచున్నాడు. (13:౩౩)
77. జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీస్వరులు మోక్షమును పొందిరి. అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుచున్నాను. (14:1)
78. అర్జునా! ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది. నేను(పరమాత్మ) తండ్రి వంటివాడను. (14:4)
79. అర్జునా! త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటంజేసి, సుఖ జ్ఞానాభిలాషల చేత, ఆత్మను దేహమునందు బందించు చున్నది. (14:6)
8౦. ఓ కౌంతేయా! రజో గుణము కోరికలయందు అభిమానము, అనురాగము పుట్టించి, ఆత్మను బందించుచున్నది. (14:7)
81. అజ్ఞానము వలన బుట్టునది తమోగుణము, అది సర్వప్రాణులను మొహింపజేయునది. ఆ గుణం, మనుజుని ఆలస్యముతోను, అజాగ్రత్తతోను, నిద్రతోను బద్దునిజేయును. (14:8)
82. మానావమనములయందు, శత్రుమిత్రులయందు సమమైన మనస్సు గలవానిని త్రిగుణాతీతుడందురు. (14:25)
8౩. బ్రహ్మమే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగా గల అశ్వర్థవృక్షము అనాది అయినది. అట్టి సంసారవృక్షమునకు వేదములు ఆకులు వంటివి. అట్టిదాని నెరింగినవాడే వేదార్ధసార మెరింగినవాడు. (15:1)
84. పునరావృత్తి రహితమైన మోక్షపధము, సుర్యచంద్రాదుల ప్రకాశమున కతీతమై, నా ఉత్తమ పథమై యున్నది. (15:6)
85. దేహులందు జఠరాగ్నిస్వరూపుడనై, వారు భుజించు భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను. (15:14)
86. పార్దా! సాహసము, ఓర్పు, ధైర్యము, శుద్ధి, ఇతరులను వంచింపకుండుట, కావరము లేకుండుట మొదలుగు గుణములు దైవాంశ సంభూతులకుండును. అట్లే డంబము, గర్వము, అభిమానము, క్రోధము, కఠీనపు మాటలాడుట, అవివేకము, మొదలగు గుణములు రాక్షసాంశమున బుట్టిన వారికుండును. (16:౩,4)
87. కామ, క్రోధ, లోభములు ఆత్మను నాశమును చేయును. అవి నరకప్రాప్తికి హేతువులు కావున, వానిని వదలి వేయవలెను. (16:21)
88. శాస్త్రవిషయముల ననుసరింపక యిచ్చామార్గమున ప్రవర్తించువాడు సుఖసిద్దులను పొందజాలడు. పరమపదమునందజాలడు. (16:23)
89. జీవులకు గల శ్రద్ధ, పూర్వజన్మవాసనాబలము వలన లభ్యము. అది రాజసము, సాత్వికము, తామసములని మూడు విధములుగా నున్నవి. (17:2)
9౦. సత్వగుణులు దేవతలను, రాజోగుణులు యక్షరాక్షసులను, తమోగుణులు భూతప్రేతగణంబులను శ్రద్ధాభక్తులతో పూజించుచుందురు. (17:4)
91. ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు, ప్రియము, హితములతో కూడిన సత్యభాషనము, వేదాద్యన మొనర్చుట, వాచకతపస్సని చెప్పబడును. (17:15)
92. జ్యోతిష్టోమాది కర్మల నాచరింపకుండుట సన్యాసమనియు, కర్మఫలము, ఈశ్వరార్పణ మొనర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు. (18:2)
9౩. కర్మములు ప్రియములు, అప్రియములు, ప్రియాతి ప్రియములని మూడు విధములు. కర్మఫలము కోరినవారు జన్మాంతరములందు ఆ ఫలములను పొందుచున్నాడు. కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు. (18:12)
94. అర్జునా! కర్మమోక్షమార్గముల, కర్తవ్య భయాభయముల, బంధమోక్షముల, ఏ జ్ఞానమెరుగుచున్నదో అది సత్వగుణ సముద్భనమని ఎరుగుము. (18:౩౦)
95. ఈశ్వరుడు యెల్ల భూతములకు నియామకుడై, ప్రాణుల హృదయ ముందన్నవాడై, అంత్రగాడు బొమ్మలనాడించు రీతిగా ప్రాణుల భ్రమింపజేయుచున్నాడు. (18:61)      
96. సమస్త కర్మల నాకర్పించి, నన్నే శరణుబొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తుని గావింతును. నీవు చింతింపకుము. (18:66)                                                                                                                    
97. ఎవడు పరమోత్క్రష్టమైనదియు, పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకుపదేశము చేయుచున్నాడో వాడు మోక్షమున కర్హుడు. (18:68)
98. ధనంజయా! పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా? నీ అజ్ఞాన జనితమైన అవివేకము నశించినదా? (18:72)
99. కృష్ణా! అచ్యుతా! నా అవివేకము నీ దయవలన తొలగెను. నాకు సుజ్ఞానము లభించినది. నాకు సందేహములన్నియు తొలగినవి. నీ ఆజ్ఞను శిరసావహించెదను. (18:7౩) 
100. యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, ధనుర్దారియగు అర్జునుడు ,ఎచట నుందురో, అచ్చట సంపద, విజయము, ఐశ్వర్యము, స్థిరమగు నీతి యుండును. (18:78)

101. గీతాశాస్త్రమును ఎవరు పటింతురో వారు భయశోకాది వర్జితులై విష్ణు సాయుజ్యమును పొందుదురు. 

ఒకటవ అధ్యాయం : అర్జున విషాద యోగము :

ధృతరాష్ట్రుడు సంజయుడితో మొదటిరోజు యుద్ధ విశేషాలు అడిగాడు.అప్పుడు సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. కౌరవులు,పాండవులు వారివారి బలాల గురించి,యోధుల గురించి అలాగే ఎదుటివారి బలాల,యోధుల గురించి పన్నిన, పన్నవలసిన వ్యుహాలగురించి మాట్లాడుకున్నారు.
అప్పుడు కౌరవులబలం,వారిలోని యోధుల గురించి తెలుసుకొనే నిమిత్తం అర్జునుడు తన బావ మరియు సారథి ఐన శ్రీకృష్ణుడితో తమ రథాన్ని రెండు సేనల మధ్యకు నడపమని చెప్పాడు.
యుద్దరంగమున అర్జునుని కోరిక మేరకు రధమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయం ద్రవించి….. అప్పుడు అర్జునుడు, కృష్ణా!అందరు మనవాళ్ళే,వారిలో కొందరు పుజ్యనీయులు.వారినందరినీ రాజ్యం కొరకు చంపి నేను ఏవిధంగా సుఖపడగలను? కావునా, నాకు విజయాము వలదు, రాజ్యసుఖము వలదు. వారు నన్నుచంపినా నేను మాత్రం వారిని చంపను. అని ధనుర్భాణములను క్రింద వదిలివేసి దుఃఖించసాగాడు.
అప్పుడు శ్రీకృష్ణుడు..... ఓ అర్జునా! పామరులకు కలిగే, స్వర్గ ప్రాప్తి ఇవ్వనిది, అపకీర్తి కలుగచేసే ఈ మోహము నీకు ఎట్లు దాపరించినది?

కావున ఓ అర్జునా! పిరికితనమునకు లోనుకావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతపా! తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్దము చేయము.

రెండవ అధ్యాయం : సాంఖ్యయోగః

మొదట సాంఖ్య అంటే విచక్షణ (తర్కించడం) అని అర్థం. అంటే ఉదాహరునకు ఒక శిష్యుడు వారి గురువును అడుగుతాడు . గురువుగారు! నా శరీరానికి ఒక ఆత్మ అంటూ వుంది కదా అడిగాడు శిష్యుడు. అప్పుడు గురువుగారు శిష్యునితో ...నువ్వే ఆత్మవి, నీ కంటూ ఓ శరీరం వుంది అంతేఅని వివరించారు గురువుగారు. ఆ ఎరుకే ఆధ్యాత్మిక ప్రజ్ఞ.
అంటే ఇక్కడ దీని అర్థం మనకు విచక్షణ జ్ఞానం కలిగినపుడు, అంటే నేను ఎవరు, ఈ శరీరం, ఈ మనస్సు మరియు ఈ ఆత్మ అంటే ఏమిటి అన్న ఆలోచన మనలో కలగడం అన్న మాట (ఆత్మానాత్మ వివేకం). అప్పుడు మనకు సత్యాన్వేషణ మొదలవుతుంది. అప్పుడు ఇక్కడ మనకు ఒక గురువు కావాలి. ఎందుకంటే ఎప్పుడు అయితే నీలో సత్యాన్వేషణ మొదలవుతుందో అప్పుడు నీ మనసులో చాల చాల విషయాలను తెలుసుకోవాలను ఉత్సాహం మొదలవుతుంది. 
అదేవిదంగా మహాభారత యుద్దములో అర్జునినికి గల సందేహాలను నివృత్తి చేయడానికి మొదలు పెట్టినపుడు, శ్రీ కృష్ణుడు అర్జునకు తెలియజేసినదే ఈ సాంఖ్యయోగః
(ఇక్కడ అర్జునునికి కలిగిన సందేహం ఏమిటంటే, యుద్దము జేసి నేను నా గురువులను, బంధువులను చంపి నేను సాధించేది ఏమిటి, ధర్మాధర్మములవిచక్షణకు దూరమై నా కర్తవ్యమును నిర్ణయించు కొనలేకున్నాను. నాకు నిజముగా శ్రేయస్కరమైన దానిని తెలుపుము. నేను నీకు శిష్యుడను, శరణాగతుడను, శాసింపుము)
శ్రీ కృష్ణ భగవానుడు పలికెను oఓ అర్జునా! శోకింపదగని వారికొరకై నీవు శోకించుచున్నావు . పైగా జ్ఞాని వలె  మాట్లాడుచున్నావు. జ్ఞానులైనవారు ప్రాణములు పోయిన వారి గురించిగాని, ప్రాణుములుపోని వారి గురించిగాని శోకింపరు. (2:11)
నీవుగాని, నేనుగాని, ఈ రాజులుగాని వుండని కాలమే లేదు. ఇక ముందు కూడా మనము ఉంటాము అనుమానమే లేదు. (అన్ని కాలములలోను మనము వున్నాము. ఆత్మ శాశ్వతం. అది అన్ని కాలములయందు ఉండును. శరీరపతనముతో అది నశించునది కాదు).   (2:12)
జీవునకు ఈ దేహమునందు కౌమారం, యవ్వనం, వార్ధక్యము ఉన్నట్లే మరణానంతరం మరియొక దేహప్రాప్తియు కలుగును. ధీరుడైనవాడు ఈ విషయమున మోహమునొందడు. (2:13)
ఓ కౌంతేయ! విషయేంద్రియోగమువలన శీతోష్ణములు సుఖదుఃఖాలు కలుగుచున్నవి. అవి అన్నియు అనిత్యములు. కనుక వాటిని పట్టించుకొనకుము. (2:14)
అర్జునా! ధీరుడైనవానికి సుఖదుఃఖాలు సమానముగా తోచును. అట్టి పురుషునికి విషయే0ద్రి సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. (2:15)
అనిత్యమైనదానికి వునికియే లేదు. సత్యమైన ఆత్మకు లేమి అనునదిలేదు. ఈ విదముగా ఈ రెండింటియొక్క వాస్తవస్వరూపములను తత్వజ్ఞానియైనవాడే దర్సించును . (2:16)
నాశరహితమైన పరమాత్మ తత్వము జగత్తునందు అంతటను వ్యాపించియున్నదని యెరుంగును. శాశ్వతమైన దానినెవ్వరును నశింపజేయజాలరు. (2:17)
ఓ అర్జునా! ఈ శరీరములు అన్నియును నశించునవియే. కాని జీవాత్మ నాశరహితము కనుక నీవు యుద్దము చేయుము.
(జీవాత్మ అంటే ఆత్మ మరియు కర్మలు. ఆత్మ అంటే శాశ్వతమైనది మరియు కర్మలు అయితే వాటిని నిష్కామంగా చేసి వాటిని వదిలించుకోవాలి.) (2:18)
ఆత్మ ఇతరులను చంపునని భావించువాడను, ఆత్మ ఇతరులచే చంపబడునని భావించువాడును, ఆ ఇద్దరును అజ్ఞానులే. ఏలననగా వాస్తవముగా ఆత్మ ఎవ్వరిని చంపదు, ఎవ్వరిచేతను చంపబడేది కాదు. (2:19)
ఆత్మకు చావుపుట్టుకలు లేవు . ఇది జన్మ లేనిది. నిత్యమూ, శాశ్వతము, పురాతనము, శరీరము చంపబదడినను ఇది చావదు. (2:20)
ఓ పార్దా! ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అనియు జననమరనములు లేనిదనియు, మార్పులేనిదనియు తెలిసికొనిన పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును? ఎవరిని ఎట్లు చంపును?  (2:21)
మానవుడు చిరిగిన పాతబట్టలను వదిలి, కొత్తబట్టలను ధరించినట్లు జీవాత్మ జీర్ణమైన శరీరమును వీడి(వదలి) క్రొత్త శరీరములను పొందుతుంది.  (2;22)
ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపజాలదు.అగ్ని దహింపజాలదు. నీరు తడుపజాలదు మరియు వాయువు అర్పివేయును సమర్ధము కాదు. ఈ ఆత్మను శోషింపజేయుటకును సాద్యము కానిది. ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది, సర్వవ్యాప్తిచెందినది, చలింపనిది, స్తిరమైనది మరియు సనాతనమైనది. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరముగానిది. మనస్సునకు అందనిది. వికారములు లేనిది. నీవు దీనికై శోకింపకు.   (2:23,24&25)
పుట్టిన ప్రతి వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మము తప్పదు. కనుక తప్పనిసరైన ఈ విషయములయందు నీవు శోకింపదగదు. (2:27)
(పుట్టిన ప్రతి వానికి మరణము తప్పదు.కాని మరణించిన ప్రతి వానికి జన్మము అనేది అతడి కర్మానుసారము మరియు అతని జ్ఞాన సముపార్జన ఆధారంగా వుంటుంది. అతడు జ్ఞానాన్ని గ్రహించి(జ్ఞానయోగము చేతను) సమస్త కర్మలను తొలగించుకొని(కర్మయోగం చేతను) వుండి అంత్య కాలమున ఆయననే (నిరాకరునిగా) స్మరించి శరీరమును త్యజిస్తే మరల జన్మ ఉండదు.)
ఓ అర్జునా ! ప్రాణులన్నియును పుట్టుకకుమందు ఇంద్రియ గోచరములు కావు. మరణాంతరము గూడ అవి అగోచరములే ఈ జననమరణముల మధ్యకాలము నందు మాత్రమే అవి గోచరములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుటవలన ప్రయోజనములేదు. (2:28)
ఎవరో ఒక మహాపురషుడు మాత్రమే ఈ ఆత్మను ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరియొక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును.వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును.ఆ విన్నవారిలో, చూచినవరిలో, చెప్పినవారిలో కూడా కొందరు దీనిని గూర్చి పూర్తిగా యెరుగరు.   (2:29)
ఓ అర్జునా! ప్రతిదేహమునందును వుండే ఆత్మ చంప వీలుకానిది. కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింపదగదు. (2:౩౦)
అంతేగాక స్వధర్మమునుబట్టియు నీవు భయపడనక్కరలేదు. ఏలననగా క్షత్రియునకు ధర్మయుద్దము శ్రేయస్కర్మమైన కర్తవ్యము మరియొక విషయము ఏదియును లేదు. (2:31)
ఈ యుద్దము నీకు ధర్మబద్దము. ఒకవేళ నీవు దీనిని ఆచరింపకున్నచో నీ స్వధర్మము నుండి పారిపోయిన వాడవు అగుదువు. దానివలన నీవు కీర్తిని కోల్పోయి, పాపమూ చేసినవాడవగుదువు. (2:౩౩)
జయాపజయాలను, లాభనష్టాలను, సుఖదుఃఖాలు సమానముగా తలంచి యుద్దసన్నద్దుడవు కమ్ము. అప్పుడు నీకు పాపములు అంటవు. (2:38)

ఓ పార్థా! సాంఖ్యశాస్త్రమున చెప్పబడిన ఈ సమత్వ బుద్దిని గురించి తెలిపితిని. ఇపుడు దానినే కర్మయోగద్రుక్పతముతో వివరించెదను, వినుము. దానిని ఆకళింపు చేసికొని, ఆచరించినచో కర్మబంధములనుండి విముక్తుడవయ్యెదవు. (2:౩9)

మూడవ అధ్యాయం : కర్మయోగః

ఈ నిష్కామకర్మయోగమును ప్రారంభించినచో దీనికి ఎన్నటికి బీజనాశనము లేదు. దీనికి విపరీత ఫలితములే యుండవు. పైగా ఈ (నిష్కామ) కర్మయోగమును ఏ కొంచెం సాధనచేసినను అది జన్మమ్రత్యురూప మహాభారమునుండి కాపాడును. (2:40)
ఓ అర్జునా! ఈ నిష్కామ కర్మయోగమునందు నిశ్చయాత్మక బుద్ధి యుండును. కానీ భోగాసక్తులైన వివేకహీనుల బుద్దులు చంచలములై, ఒక దారీ తెన్నూ లేక కోరికలవెంట నలువైపులా పరుగులు తీయుచు అనంతములుగా ఉంటాయి. (2:41)
ఓ అర్జునా! వేదములు సత్వరజస్తమోగుణముల కార్యరూపములైన సమస్త భోగములను గూర్చియు, వాటిని పొందుటకై చేయవలసిన సాధనలను గూర్చియు ప్రతిపాదించును. నీవు ఆ భోగముల యెడలను వాటి సాధనలయందును ఆశక్తిని త్యజింపుము. సుఖదుఖాది ద్వంద్వములకు అతీతుడవు కమ్ము. నిత్యుడైన పరమాత్మయందే స్తితుడవు కమ్ము. నీ యోగక్షేమముల కొఱకై ఆరాటపదవద్దు. అంతఃకరణమును వశమునందుంచుకొనుము. (2:45)
అన్నివైపులా జలములతో నిండియున్న మహాజలాశయము అందుబాటులోనున్న వానికి చిన్న చిన్న జలాశయములవలన ఎంత ప్రయోజనమో, పరమాత్మ ప్రాప్తినంది పరమానందము అనుభవించు బ్రహ్మజ్ఞానికి వేదములవలన అంతియే ప్రయోజనము వుంటుంది.  (2:46)         
కర్తవ్యకర్మలను ఆచరించుట యందే నీకు అధికారము కలదు కాని, వాని ఫలితముపైన లేదు. నీవు కర్మఫలమునకు కారణము కారాదు. అట్లని కర్మలను చేయుట మానరాదు. ఫలాపేక్షరహితుడై కర్మలనాచరింపుము.  (2:47)
ఓ ధనుంజయా! యోగస్తితుడవై ఆసక్తిని వీడి, కార్యములు ఫలించినను ఫలించకున్నను సమత్వ భావమును కలిగియుండి, కర్తవ్యకర్మలను ఆచరింపుము. ఈ సమత్వభావమునే యోగమందురు. (2:48)
ఓ అర్జునా! ఈ సమత్వబుద్దితోకూడిన నిష్కామ కర్మకంటే ప్రతి ఫలాపేక్షతో కూడిన సకామకర్మ తక్కువైనది. కాబట్టి నీవు సమత్వబుద్దియోగమునే ఆశ్రయింపుము. ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంతదీనులు, క్రుపనులు. (2:49)
సమత్వ బుద్దియుక్తుడైనవాడు పుణ్యపాపములను రెండింటిని ఈ లోకమునందే త్యజించును. అనగా కర్మఫలములు వానికి అంటవు. కనుక నీవు సమత్వబుద్ది రూపయోగమును ఆశ్రయింపుము. ఇదియే కర్మాచరణమునందు కౌశలము. ఇదియే యోగము. (2:50)
ఏలనన సమబుద్దియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి, జనన మరణ బంధములనుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన, శాశ్వతమైన మోక్షపదమును పొందుదురు. (2:51)
మోహమనెదడి మాలిన్యము నుండి పూర్తిగా బయట పడినప్పుడే నీవు వినిన, వినబోవు ఇహపరలోకసంబందమైన సమస్త భోగములనుండి వైరాగ్యమును పొందగలవు. (2:52)
నానా విధములైన మాటలను వినుటవలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా నిలిచి ఉన్నప్పుడే నీకు ఈ యోగము ఏర్పడును. (2:53)
అర్జునుడు పలికెను ఓ కేశవా ! సమాదిస్థితుడై పరమాత్మా ప్రాప్తినందిన స్తితప్రజ్ఞుని యొక్క లక్షణములెవ్వి? అతడు ఎట్లు భాసించును? ఎట్లు కూర్చోనును? ఎట్లు నడుచును? (2:54)
ఓ అర్జునా! మనస్సునందలి కోరికలన్నియును పూర్తిగా తొలగిపోయి, ఆత్మద్వార ఆత్మయందు సంతుస్టుడైనవానిని, అనగా పరమాత్మ సంయోగమువలన ఆత్మానందమును పొందిన వానిని స్థితప్రజ్ఞుడని యందురు. (2:55)
దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనివాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ కోల్పోనివాడును, రాగము, భయము, క్రోధము పోయిన వాడును ఐనట్టి మననశీలుడిని స్థితప్రజ్ఞుడని చెప్పబడును. (256)
దేనియందును మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారము లకు లోనుగానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. (2:57)
తాబేలు తనఅంగములను అన్నివైపులనుండి లోనికి ముడుచు కొనునట్లుగా, ఇంద్రియములను విషయాదుల నుండి అన్నివిధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్తిరముగా ఉన్నట్లు భావించవలెను. (2:58)
ఇంద్రియముల ద్వార విషయములను గ్రహింపనివాని నుండి ఇంద్రి యార్ధములు మాత్రమూ వైదొలగును. కాని వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్తితప్రజ్ఞునకు పరమాత్మా సాక్షాత్కారమైనందు వలన వాని నుండి ఆ ఆశక్తి గూడ తొలగిపోవును. (2:59)  
ఓ అర్జునా! ఇంద్రియములు మహాశక్తి కలవి, మనష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను, ఆసక్తి తొలగిపోనంతవరకు అవి అతని మనసును ఇంద్రియార్ధములవైపు బలవంతముగా లాగికొనిపోవుచునే యుండును. (2:60)
కనుక సాధకుడు ఆ ఇంద్రియములను అన్నింటిని వశము నందుంచుకొని, మత్పరయాణుడై, ధ్యానమునందు కూర్చొననవలెను. ఏలనన ఇంద్రియములను వసమునందుంచుకొనువాని బుద్ధి స్థిరముగానుండును. (2:61)
విషయచింతన చేయువానికి ఆ విషయములయందు ఆసక్తి ఏర్పడును. ఆసక్తివలన ఆ విషయములను పొందుటకు కోరికలు కలుగును. ఆ కోరికలు తీరనప్పుడు క్రోధముకల్గును. అట్టి క్రోధము వలన వ్యామోహము కలుగును. దాని ప్రభావమున బుద్ధి అనగా జ్ఞానశక్తి నశించును. బుద్ధి నాశము వలన మనుష్యుడు పతనమగుచున్నాడు. (2:62,6౩)
ఇంద్రియములను వశమునందు వుంచుకొనిన సాధకుడు రాగద్వేషరహితుడై, ఇంద్రియముల ద్వార విషయములను గ్రహించుచున్నను ప్రశాంతతను పొందుచున్నాడు. (2:64)
మనోనిర్మలత్వము వలన అతని దుఃఖములన్నియును నశించును. ప్రసన్నచిత్తుడైన కర్మయోగియొక్క బుద్ధి అన్ని విషయముల నుండియు వైదొలగి, పరమాత్మయందు మాత్రమే పూర్తిగా స్తిరమగును. (2:65)
ఇంద్రియనిగ్రహము మనోనిగ్రహము లేనివానికి వివేకము కలుగదు. అట్టి మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తికభావమే కలుగదు. తద్భావన హీనుడైన వానికి శాంతి లభింపదు. మనశ్శాంతి లేనివానికి సుఖము ఎట్లు లభించును ? (2:66)
నీటిపై తేలుచున్న నావను గాలి నెట్టివేయును. అట్లే ఇంద్రియార్ధముల యందు సంచరించు ఇంద్రియములలో మనస్సు ఏ ఒక్క ఇంద్రియముతో కూడియున్నను ఆ ఒక్క ఇంద్రియమే మనోనిగ్రహములేని మనజుని బుద్దిని అనగా విచక్షణా శక్తిని హరించిచున్నది. కనుక ఓ అర్జునా! ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి అన్నివిధములుగా పూర్తిగా నిగ్రహించిన పురుషుని యొక్క బుద్ధి స్తిరముగా ఉండును. (2:67,68)
సమస్త ప్రాణులకూ ఏది రాత్రియో అప్పుడు యోగి మేల్కొని యుండును. ఎప్పుడు నశ్వరమైన ప్రాపంచిక సుఖప్రాప్తికై ప్రాకులాడుచు ప్రాణులన్నీయు మేల్కొని యుండునో అది పరమాత్మతత్వము నెరిగిన మునికి రాత్రిగా నుండును. (2:69)
సమస్తదిశలనుందడి పొంగి ప్రవహించుచు వచ్చిచేరిన నదులన్నియును సముద్రమును ఏ విధముగ చలింప చేయకనే ప్రవేసించుచున్నవో, అలాగే సమస్తభోగములను స్థితప్రజ్ఞునియందు ఎట్టి వికారములు కల్గింపకయే వానిలో లీనమగును. అట్టి పురుషుడే పరమశాంతిని పొందును. భోగాసక్తుడు శాంతిని పొందలేడు. (2:70)
కోరికలన్నింటిని త్యజించి, మమతా-అహంకార వర్జితుడై శబ్దాది విషయములపై ఎవనికి ఆశ లేదో అట్టి పురుషునకే శాంతి లభిస్తుంది. (2:71)
అర్జునా! బ్రహ్మీస్థితి యనగా ఇదియే. ఈ బ్రాహ్మీస్థితిని పొందిన యోగి ఎన్నడును మోహితుడు కాడు. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుస్టారము, బ్రహ్మప్రాప్తిసాధనము కలిగిన జీవుడు సంసారమున బడక, సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు. అంత్యకాలము నందును ఈ బ్రహ్మీస్తితియందు స్థిరముగానున్నవాడు బ్రహ్మానందరూపమగు మోక్షమును పొందుచున్నాడు. (2:72)
అర్జునుడు పలికెను? ఓ కృష్ణా! నీ అభిప్రాయమును బట్టి కర్మకంటేను జ్ఞానమే శ్రేష్టమైనచో, భయంకరమైన ఈ యుద్దకార్యమునందు నన్నేల నియోగించుచున్నావు ? (౩:1)
అర్జునా! ఈ లోకములో ఆత్మానాత్మ వివేకముగల సన్యాసుకలు జ్ఞానయోగము చేతను, చిత్తశుద్దిగల యోగీశ్వరులకు కర్మయోగము చేతను, ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడియున్నది. (౩:౩)
మనుష్యుడు కర్మలను చేయకపోవుటవలన యోగనిష్టాసిద్ది అతనికి లభింపదు. అట్లే కేవలము కర్మలను త్యజించినంత మాత్రమున సాంఖ్యనిస్టను అతడు పొందడు.   (౩:4)
ఎవడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రముగూడ కర్మను ఆచరింపకుండ ఉండలేడు. మనుష్యలందరును ప్రకృతి నిత్యలైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతివ్యక్తియు అస్వతంత్రుడై కర్మను ఆచరింపవలసియే యుండును. (౩:5)
బలవంతముగా, బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి, మానసికముగా ఇంద్రియ విషయములను చింతించునట్టి వానిని డంభాచారి అని కపటుడు అని అంటారు. (౩:6)     
అర్జునా! మనస్సుతో ఇంద్రియములను వశపరచుకొని, అనాసక్తుడై ఇంద్రియములద్వార కర్మయోగాచరణమును కావించు పురుషుడు ఉత్తముడు. (౩:7)
నీవు శాస్త్రవిహితకర్తవ్యకర్మలను ఆచరింపుము. ఏలనన కర్మలను చేయకుండుటకంటెను చేయుటయే మేలుగదా! కర్మలను ఆచరింపనిచో నీ శరీరయాత్రగూడ సిద్దింపదు .(౩:8)
ఓ అర్జునా! యజ్ఞార్ధము చేయబడు కర్మలలో గాక ఇతర కర్మలయందు నిమగ్నమగుటవలన మనుష్యులు కర్మ భంధములలో చిక్కుపడుడురు. కనుక నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞార్ధమే కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. (౩:9)
కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞసహితముగా ప్రజలను సృష్టించి, మీరు ఈ యజ్ఞముల ద్వార వ్రుద్దిచెందుడు. ఈ యజ్ఞములు మీకు కామదేనువువలె కోరిన కోర్కేలనేల్ల తీర్చునది అగుగాక. (౩:10)
యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్టపురుషులు అన్ని పాపముల నుండి ముక్తులయ్యేదరు. తమ శరీరపోషనకోరకే ఆహారము సిద్దపరచు కొను పాపులు పాపమునారగించినవారైవున్నారు. (౩:13)
అన్నము వలన జంతుజాలము పుట్టును. వర్షము వలన అన్నము సమకూరును. యజ్ఞము వలన వర్షము కలుగును. ఆ యజ్ఞము కర్మ వలననే సంభవమగును. (౩:14)
సత్కర్మలు యజ్ఞములకు మూలములు. వేదములు సత్కర్మలకు మూలములు. వేదములు పరబ్రహ్మనుండి ఉద్భవించినవని తెలిసికొనుము. అందువలన సర్వవ్యాపకమగు పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిస్టితుడై యున్నాడు. (౩:15)
ఓ అర్జునా! నాచే నడుపబడు ఈ లోకము అను సృష్టి చక్రమును యెవడు అనుసరింపడో (అనగా తన కర్తవ్యములను పాటింపడో) వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు. అట్టివాడు వ్యర్ధుడు. జ్ఞాని కానివాడు సదా కర్మల నాచరించుచునే ఉండవలెను. (౩:16)
ఎవడు కేవలము అత్మయందే క్రీడించుచు ఆత్మ యందే సంతుష్టుడై యుండునో, అట్టి జ్ఞానికి చేయదగిన కార్యమేదియులేదు.(౩:17)
అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుటవలన ప్రయోజనంగాని, చేయకుండుటవలన వలనన దోషముగాని ఉండదు. అనగా అతనికి సర్వ ప్రాణులతోడను స్వార్ధపరమైన సంబంధము ఏ విధముగాను లేదు. (౩:18)
అందువలన నీవు నిరంతరము ఫలాపేక్ష లేనివాడవై కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము. ఫలాపేక్ష వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును.(౩:19)
జనకుడు మున్నగువారు ఆసక్తి రహితముగా(అనాశక్తిగా) కర్మలను ఆచరించుటవలననే పరమసిద్దిని పొందిరి. కావున నీవును లోకహితార్ధమై కర్మలను చేయవలయును. (౩:20)
ఉత్తములైన వారు దేని నాచరించునో, ఇతరులును దానిని ఆచరింతురు. ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురో లోకమంతయు దానినే అనుసరించును. (౩:21)
oఅర్జునా! ఈ ముల్లోకములయందును నాకు కర్తవ్యము అనునదియే లేదు. అట్లే పొందదగిన వస్తువులలో నేను పొందనిదియును లేదు. ఐనను నేను కర్మలను చేయుచునే వున్నాను.(౩:22)
ఓ అర్జునా! అజ్ఞానులు కర్మలయందు ఆశక్తులై వాటిని ఆచరించినట్లుగా జ్ఞానీ కూడా లోకహితార్థమై ఫలాపేక్షలేక కర్మలను చేయవలెను. (౩:25)
పరమాత్మస్వరూపమునందు నిశ్చలస్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఫలాసక్తితో ఆచరించుచు అజ్ఞానులబుద్దులను భ్రమకులోను చేయరాదు. అనగా కర్మలయందు వారికి అశ్రద్దను కలిగింపరాదు. పైగా తానుకూడ శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితో గూడ అట్లే చేయింపవలెను. (౩:26) 
వాస్తవముగా కర్మలన్నియు అన్నివిధముల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడుచుండును. అహంకార విముడాత్ముడు ఈ కర్మలకు నేనే కర్తను అని భావించుచున్నాడు. (౩:27)
ఓ అర్జునా! గుణవిభాగతత్వమును, కర్మవిభాగ తత్వమును తెలిసికొన్న జ్ఞానయోగి గుణములే ప్రవర్తించుచున్నవని భావించి వాటియందు ఆశక్తినొందడు . (౩:28)
ప్రకృతి గుణములచే పూర్తిగా మోహితులైన మనుష్యులు ఆ గుణములయందును, కర్మలయందును మిక్కిలి ఆసక్తులగుదురు. అట్టి కర్మసంగులగు అల్పజ్ఞులను, మందబుద్దులైన అజ్ఞానులను పూర్తిగా తెలిసిన జ్ఞానియైనవాడు భ్రమకు గురిచేయరాదు. (౩:29)
సమస్త కర్మలు నాయందు సమర్పించి జ్ఞానముచే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపమును వదిలి నిర్భయముగా నీ కర్తవ్యమును నిర్వర్తించుము.  (౩:౩౦)
శ్రద్ధాయుక్తులై అసూయలేనివారై, నా ఈ అభిప్రాయమును ఏ మనుజులు అనుసరించుచున్నారో వారు అందరు కూడ సమస్త కర్మబంధముల నుండి విడివడుచున్నారు. (౩:31) 
ఈ ఉపదేశమును అనుసరింపని మూర్ఖులు సమస్త ప్రాపంచిక విషయములయందును మోహితులై భ్రష్టులై, కష్టనష్టముల పాలెయ్యెదరని గ్రహింపుము. (౩:౩2)
సమస్త ప్రాణులును తమ తమ ప్రకృతులను అనుసరించి స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని అనుసరించియే క్రియలను ఆచరించును. కావున నిగ్రహమేమి చేయగలదు. (౩:౩౩)
ప్రతి ఇంద్రియార్ధమునందును రాగద్వేషములు దాగియున్నవి. మనుష్యుడు ఈ రెండింటికిని వశము కాకూడదు. ఏలనన ఈ రెండే మానవుని శ్రేయస్సునకు విఘ్నకారకములు, ప్రబలశత్రువులుగదా! (౩:34)
పరధర్మమునందు ఎన్నో సుగుణములు ఉన్నను స్వధర్మమునందు అంతగా సుగుణములు లేకున్నను చక్కగా అనుస్టింపబడు ఆ పరధర్మము కంటెను స్వధర్మాచరణమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించుటటయు శ్రేయస్కర్మమే. పరధర్మాచరణము భయంకరమైనది. ఆచరణకు అనుచితమైనది. (౩:35)  
అర్జునుడు పలికెను ఓ కృష్ణా! మానవుడు తనకు ఇష్టము లేకున్నను బలాత్కారముగా దేని ప్రభావముచే ప్రేరితుడై పాపములను చేయుచున్నాడు? (౩:36)
శ్రీ భగవానుడు పలికెను - రజోగుణమునుండి ఉత్పన్నమగునదే కామము. ఇదియే క్రోధరూపముగా మారును. ఇది త్రుప్తిలేనిది.పైగా అంతులేని పాపకర్మాచారణములకు ఇదియే ప్రేరకము. కనుక ఈ కామము మోక్షమునకు పరమ శత్రువుగా ఎరుంగుము. (౩:37)
పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామముచేత జ్ఞానము కప్పబడి యుండును. (౩:38)
కామమునకు ఇంద్రియములు, మనస్సు,బుద్ధి నివాసస్థానములు. ఈ కామము మనో బుద్ధీంద్రయముల ద్వారా జ్ఞానమును కప్పివేసి, జీవాత్మను మొహితునిగా చేయును. (౩:40).
కావున ఓ అర్జునా! మొదట ఇంద్రియములను వశపరచుకొనుము. పిదప జ్ఞానవిజ్ఞాములను నశింపజేయునట్టి మహాపాపియైన ఈ కామమును అవశ్యముగా సర్వశక్తులనొడ్డి పూర్తిగా విడువుము. (౩:41)

స్థూలశరీరముకంటెను ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటెను మనస్సు, దాని కంటెను బుద్ధి గొప్పది. ఆ బుద్ధి కంటెను మిక్కిలి గొప్పది, సూక్ష్మమైనది ఆత్మ.ఈ విదముగా బుద్దికంటేను ఆత్మ అతీతమైనదని తెలిసికొని, బుద్ధిద్వారా మనస్సును వశపరుచుకొని, జయింపశక్యముకాని శత్రువైన కామమును సంహరింపుము. (౩:42,43)